నర్సు పోస్టులపై దొంగలెక్కలు.. ఏదీ నిజం!

by Shyam |
నర్సు పోస్టులపై దొంగలెక్కలు.. ఏదీ నిజం!
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైద్యారోగ్య శాఖ ప్రాధాన్యతను గుర్తించినందునే నిధులతో పాటు మానవ వనరులను పెంచినట్లు ప్రభుత్వం చెప్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ తదితర అన్ని విభాగాల కింద 7,743 స్టాఫ్ నర్సు పోస్టులున్నాయని ప్రభుత్వం తాజా అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొంది. కానీ రాష్ట్రంలో మొత్తం 8,403 పోస్టులు ఉన్నాయని ఆర్టీఐ దరఖాస్తుకు సంబంధిత అధికారులు బదులిచ్చారు. రెండు వేర్వేరు ఆర్టీఐ దరఖాస్తులకు 2019, 2020లలో ఇచ్చిన సమాధానాల ప్రకారమే పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటే వేటినీ రద్దు చేయకుండా 2021 మార్చిలో ఆ సంఖ్య 7,743కు ఎలా తగ్గిందన్న సందేహాలు వెల్లువెత్తాయి.

అసెంబ్లీలో చెప్పే లెక్కలు ఒక తరహాలో ఉంటే ఆర్టీఐ ద్వారా ఇస్తున్న లెక్కలు మరోలా ఉండడం ఆసక్తికరంగా మారింది. ఆర్టీఐ సమాధానం ప్రకారం ప్రజారోగ్య శాఖలో మొత్తం 6,132 పోస్టులు ఉన్నట్లు అధికారి పేర్కొన్నారు. వైద్య విధాన పరిషత్‌లో 2,271 పోస్టులున్నట్లు ఆ శాఖ అధికారి పేర్కొన్నారు. ఈ రెండు విభాగాల్లో కలిపి మొత్తం 8,403 పోస్టులున్నట్లు గతేడాది డిసెంబరు నాటికే లెక్క తేలగా వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో లిఖితపూర్వకంగా 7,743 పోస్టులున్నట్లు పేర్కొనడం కొత్త సందేహాలకు తెర లేపినట్లయింది.

ఇంతకూ రాష్ట్రంలో వివిధ విభాగాల్లో కలిపి నర్సుల సంఖ్య అసెంబ్లీలో మంత్రి చెప్పినట్లుగా 7,743 మాత్రమేనా లేక ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాధానాల ప్రకారం 8,403 పోస్టులా అనేది తేలాల్సి ఉంది. ఏ రూపంలో అయినా పోస్టుల సంఖ్య ఒకే తీరులో ఉండాల్సినప్పటికీ వేర్వేరుగా ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక ఆయుష్, ఐపీఎం, కార్మిక శాఖ, ఈఎస్ఐ, పోలీసు లాంటి విభాగాల్లోని నర్సుల పోస్టుల సంఖ్యను కలిపితే ఇంకా ఎక్కువే అవుతుంది. కానీ మంత్రి సమాధానం వాటికంటే తక్కువగా ఉన్నట్లు చెప్తుండడమే ఇప్పుడు మింగుడుపడడంలేదు.

ఖాళీ పోస్టులే ఎక్కువ..

మొత్తం మంజూరైన నర్సింగ్ పోస్టుల సంఖ్యతో పోలిస్తే భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి. మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వెలువరించిన గణాంకాల ప్రకారం మొత్తం 7,743 రెగ్యులర్ పోస్టుల్లో 4,012 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఇందులో 688 పోస్టుల్ని కాంట్రాక్టు సిబ్బందితో భర్తీ చేయడంతో ఖాళీ పోస్టుల సంఖ్యను 3,324గా చూపించారు. ఇందులో 3,311 పోస్టుల్ని భర్తీ చేయడానికి మూడేళ్ళ క్రితం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ వెలువడినా ఇప్పటికీ వివిధ కారణాలతో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలుకాలేదు. మంజూలైన పోస్టుల్లో పనిచేస్తున్నవాటికంటే ఖాళీ పోస్టుల సంఖ్యే ఎక్కువగా ఉంది.

ఇక ఆర్టీఐ ద్వారా వచ్చిన గణాంకాలను పరిశీలిస్తే ప్రజారోగ్య శాఖలో స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్, నర్సింగ్ ట్యూటర్, సూపరింటెండెంట్ లాంటి పోస్టులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే మంజూరైన పోస్టుల సంఖ్య 6,132. కానీ ఇందులో పనిచేస్తున్నవి 2,878 మాత్రమే. ఖాళీగా ఉండిపోయినవి 3,254 పోస్టులు. పనిచేస్తున్నవాటికంటే ఖాళీ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. వైద్య విధాన పరిషత్ గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 2,271 పోస్టుల్లో ప్రస్తుతం పనిచేస్తున్నవి 1,113 కాగా, మరో 1,158 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఖాళీ పోస్టుల సంఖ్యే ఎక్కువగా ఉంది.

నర్సింగ్ కాలేజీలపైనా నిర్లక్ష్యం..

కరోనా కాలంలో పేషెంట్లకు సేవలు చేసిన నర్సుల కృషిని ప్రశంసిస్తున్న ప్రభుత్వం ఖాళీ పోస్టుల భర్తీ విషయంలోనూ, కొత్తగా పోస్టుల్ని సృష్టించి రిక్రూట్‌మెంట్ చేయడంలోనూ ఆ తరహా చొరవ తీసుకోవడంలేదని పై గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. తెలంగాణ ఏర్పడిన ఆరున్నరేళ్ళలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఏర్పడకపోగా ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థల్లో బోధనా సిబ్బంది కూడా తగిన సంఖ్యలో లేరు. ఇక ప్రైవేటు నర్సింగ్ కళాశాలల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులను క్లియర్ చేయడంలోనూ ప్రభుత్వంవైపు నుంచి నిర్లక్ష్యం కనిపిస్తోంది. దాదాపు పాతికకు పైగా దరఖాస్తులు వస్తే అందులో కొన్నింట ఉన్నత స్థాయి (హై లెవల్) కమిటీ తనిఖీలు కూడా పూర్తయ్యాయి. ఆ కమిటీ సిఫారసు చేసినా ప్రభుత్వం అనుమతి మంజూరు చేయలేదు.

ఒకవైపు ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు లేకపోగా మరోవైపు నర్సుల కొరతను తీర్చే విద్యా సంస్థల విషయంలోనూ తగిన చొరవ ప్రభుత్వం నుంచి కనిపించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనాకంటే ముందే కేరళ, ఒడిషా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నర్సులు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో, పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసేవారు. కానీ కరోనా భయంతో చాలా మంది సొంతూళ్ళకు వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా తెలంగాణలో కొరత ఏర్పడింది. చివరకు కార్పొరేట్ ఆసుపత్రులు సైతం ఎక్కువ జీతం ఇచ్చి నర్సుల్ని నియమించుకోవాలనుకున్నా తగిన సంఖ్యలో దొరకక ఇబ్బందులు పడ్డాయి. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నర్సుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపడంలేదన్న నిరసనతో ఒక నర్సు పోటీ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Advertisement

Next Story