- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు
దిశ, తెలంగాణ బ్యూరో: ఎట్టకేలకు పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. స్లాట్ల బుకింగ్ విధానానికి స్వస్తి పలికింది. దీంతో అధికారులు కార్డ్ విధానాన్ని పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది వరుసగా మూడో ఆదివారం కూడా విధులు నిర్వహించారు. కార్డ్ ను ఆచరణలో పెట్టేందుకు ట్రయల్ రన్ చేశారు. సోమవారం నుంచి దరఖాస్తుదారులకు ఇబ్బందులు కలుగకుండా ముందుగానే అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అన్ని ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తారా? లేదా? అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. నిజానికి ఆగస్టు 26 తర్వాత పరిస్థితి పునరావృతం కానుంది. ఇది 30 శాతానికే పరిమితం కానుందని అంచనా. గతంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చిరంజీవులు జారీ చేసిన సర్క్యులర్ లైవ్ లోనే ఉంది. అది చెల్లదంటూ ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. దాని ప్రకారం ఆమోదించిన లే అవుట్లలోని ప్లాట్లు, అనుమతి పొందిన భవనాలు, ఇండ్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త విధానంలో కొన్ని రకాల సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కార్డ్ లో అన్ని రకాల సర్వీసులు అందిస్తారు. ఆటోమెటిక్ మ్యూటేషన్ మాత్రమే ఉండదు. క్రయవిక్రయాలు జరిగిన తర్వాత మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏదో అనుకుంటే
కొత్త నిబంధనలతో అక్రమాలకు చెక్ పడుతుందని ప్రభుత్వం భావించింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ లేఅవుట్లే అధికంగా ఉన్నాయి. వాటిని యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసినా లావాదేవీలను ఆమోదించారు. సర్వే నంబర్లతోనే ప్లాట్ల క్రయ విక్రయాలు సాగాయి. కొన్ని ప్రాంతాలలో లేఅవుట్లకు పేర్లు పెట్టారు. ఇంకొన్నింటికీ పేర్లు లేవు. అనుమతి పొందిన లేఅవుట్లలోని ప్లాట్లకు, అనధికార ప్లాట్లకు ఒకే విధమైన స్టాంపు డ్యూటీ కట్టించుకున్నారు. ప్లాట్ల క్రయ విక్రయాలు లెక్కలేనన్నిసార్లు జరిగాయి. ప్రతి లావాదేవీకి స్టాంపు డ్యూటీ చెల్లించారు. హక్కులు లభిస్తున్నాయన్న ఉద్దేశ్యంతో ఆస్తులను కొనుగోలు చేసినవారే అత్యధికం. ఇండ్లు కట్టుకొని ఉండాలనుకున్నవారి కంటే పెట్టుబడిగా కొనుగోలు చేసిన వారి సంఖ్యనే ఎక్కువ. ఆకస్మాత్తుగా రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో పెట్టుబడులన్నీ జీరోగా మారాయి. హక్కులు తిరిగి ఎప్పుడు దక్కుతాయో అర్ధంగాక సతమతమవుతున్నారు. అవసరానికి అమ్ముకోవాలని భావించినవారికి నిరాశే ఎదురవుతోంది.
కొత్తకొత్తగా అంటూ
కొత్త పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాల ద్వారా రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా, లాక్ డౌన్ తో అనేక రంగాలు దివాలా తీశాయి. లాక్ డౌన్ తర్వాత కోలుకుంటుందని భావించిన రియల్ ఎస్టేట్ రంగంపై పిడుగులా ఈ చట్టాలను అమలు చేశారు. 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి రోజూ రూ.30 కోట్లకు పైగా ఆదాయం లభించేది. కరోనాతో ఆగిన రిజిస్ట్రేషన్లను మే నుంచి అనుమతించారు. ఆగస్టు వరకు క్రమంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కొత్త నిబంధనల కారణంగా ఆగస్టు 26వ తేదీ రిజిస్ట్రేషన్ల సంఖ్య 30 శాతానికి పడిపోయిందని అంచనా. ప్రభుత్వానికి ఫీజు చెల్లించడం ద్వారా అక్రమాలను సక్రమం చేసుకునేందుకు ఎల్ఆర్ఎస్ ను పునరుద్ధరించారు. ఎల్ఆర్ఎస్ కోసం యజమానులు పోటీ పడ్డారు. ఏకంగా 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
ఆదాయం జీరో
కరోనా కారణంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడింది. ఎల్ఆర్ఎస్ ప్రకటనతో మరింతగా ఆర్థిక నష్టం కలిగింది. ప్రతికూల సమయంలోనే అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణతో ఆదాయాన్ని సమీకరించుకోవాలని ప్రభుత్వం భావించింది. రెవెన్యూ మీద ప్రభావం చూపుతుందని అంచనా వేయలేదు. ఆగస్టు 31 నుంచి అక్టోబరు 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించారు. ఫీజు చెల్లించేందుకు జనవరి నెలాఖరు వరకు గడువుగా నిర్ణయించారు. ఇప్పటి వరకు వీటిని పరిశీలించలేదు. 40 రోజులలో అధికారులు దరఖాస్తులను ఏ మేరకు పరిశీలిస్తారో చూడాలి. అప్పటి వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 30 శాతం కూడా ఉండకపోవచ్చునని సబ్ రిజిస్ట్రార్లు స్పష్టం చేస్తున్నారు. ఏనాడూ రిజిస్ట్రేషన్లు నిలిపివేసి ఎల్ఆర్ఎస్ పథకాన్ని అమలు చేయలేదు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అమలు చేయిస్తున్నారు.
ఆ లేఖ సజీవమే
అనధికార ప్లాట్లు, అనుమతులు లేని భవనాలను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ జీహెచ్ఎంసీ నుంచి అప్పటి రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చిరంజీవులుకు లేఖ రాశారు. ఇది తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సర్క్యులర్ జారీ చేశారు. ఆగస్టు 26వ నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. భవనాలకు, లేఅవుట్లుకు అనుమతులు తప్పనిసరి అని నిర్దేశించారు. అక్రమ ప్లాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించొద్దని ప్రభుత్వం నుంచి సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అవి ఇప్పటికీ లైవ్ లోనే ఉన్నాయి. కార్డ్ ను పునరుద్ధరించినా నామమాత్రపు ఆస్తులకే రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నది వాస్తవం. ఎల్ఆర్ఎస్ సర్క్యులర్, అనుమతి పత్రాల వివరాలను సేల్ డీడ్ లోనే పొందుపరుస్తామని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ సబ్ రిజిస్ట్రార్ చెప్పారు.
అప్పుడేం చేశారు?
ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల సంగతేంటి సర్? ఎల్ఆర్ఎస్ కి అప్లై చేసుకొని నెలలు గడుస్తున్నా ఇంత వరకు దాని ఊసే లేదు. ఏం చేస్తోంది? ఎందుకు చేస్తోంది? అసలు ఏం ఆలోచిస్తోంది? తనది తనకైనా అర్థం అవుతోందా ఈ ప్రభుత్వానికి ? జిల్లాలలో, మున్సిపాలిటీలలో 90 శాతం అన్ అప్రూవల్ లే అవుట్లే ఉన్నాయి. వెంచర్ వేసినప్పుడు ఏం చేశారు? రిజిస్ట్రేషన్ ఆఫీసులో లావాదేవీలు జరుగుతుంటే ఏం చేశారు? ఇప్పుడొచ్చి ఎల్ఆర్ఎస్ అంటారు? పోనీ ఎంత కట్టాలో చెప్పి వాటికి కూడా వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని జనాలు నెత్తి నోరు కొట్టుకుంటుంటే అర్థం అయిత లేదా? ఈ సీఎం కేసీఆర్ కి.. కర్మరా బాబు కర్మ.. తెలంగాణ కావాలని ఓయూ క్యాంపస్ లో తిండి తిప్పలు మానుకొని ఉద్యమంలో పాల్గొన్నాం కదా.. మరి ఈ మాత్రం అనుభవించాల్సిందేనా? నోటిఫికేషన్ల గేమ్ ఎక్కడి దాకా పోతుందో చూడాలి ఇగ … తప్పుతుందా మరి.. అంటూ సోషల్ మీడియాలో భారతీయాదవ్ పేరిట ఓ పోస్టు వైరల్ అవుతోంది.
క్రయ విక్రయాలు వీటికే
= కొత్త మున్సిపల్ చట్టం సెక్షన్ 172 (16) ప్రకారం లే అవుట్ ఆమోదం లేని ఓపెన్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయరు.
= మున్సిపల్ చట్టం సెక్షన్ 178 (3) ప్రకారం అనుమతి లేని నిర్మాణాలను రిజిస్ట్రేషన్లు చేయరు.
= పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 113 (8) ప్రకారం అనుమతి లేని లే అవుట్ల నుంచి విక్రయించిన స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం లేదు. గ్రామకంఠంలోని స్థలాలలో భవనాలు ఉంటే అనుమతిస్తారు.
= హైదరాబాద్, హైదరాబాద్ చుట్టూ హెచ్ఎండీఏ ఆమోదం పొందిన ప్లాట్ల లావాదేవీలకు మాత్రమే అనుమతిస్తారు. లేదంటే ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకుంటే రిజిస్ట్రేషన్ చేయనున్నారు.
= జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల నుంచి అనుమతులు ఉన్నవాటిని రిజిస్ట్రేషన్ చేస్తారు. బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకున్నవాటి లావాదేవీలు చెల్లుతాయి.