ఎయిర్‌టెల్‌తో నోకియా భారీ డీల్!

by Harish |
ఎయిర్‌టెల్‌తో నోకియా భారీ డీల్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు మొబైల్ పరిశ్రమలో ఏకఛత్రాధిపత్యం చేసిన నోకియా మళ్లీ అదే దూకుడు చూపించేందుకు సిద్ధమవుతోంది. దీనికి, టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తోడవుతోంది. నోకియా సంస్థ ఎయిర్‌టెల్‌తో భారీ ఒప్పందాన్ని చేసుకుంది. దీని విలువ రూ. 7500 కోట్లు. బహుళ సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు మంగళవారం నోకియా సంస్థ ప్రకటించింది. ఈ ఒప్పందంతో దేశంలోని వినియోగదారుల నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మరింత పెంచి 5జీ సేవలను అందించాలనేది తమ లక్ష్యమని సంస్థ వెల్లడించింది.

5జీ లక్ష్యం..

మరో రెండేళ్ల నాటికి ఇండియాలో 3 లక్షల కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని, ఎయిర్‌టెల్‌తో కలిసి పని చేయనున్నట్టు నోకియా అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఉన్న 4జీని మరింత పటిష్టం చేసి, భవిష్యత్తు నెట్‌వర్క్ అయిన 5జీ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచడానికి సిద్ధమవుతున్నామని, ఎయిర్‌టెల్ సంస్థకు చెందిన దేశంలోనీ 9 సర్కిళ్లలో ఈ ఒప్పందాన్ని చేసుకుంది.

చిన్న గ్యాప్ తర్వాత…

అతిపెద్ద టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌తో డీల్ ద్వారా మార్కెట్లో కనెక్టివిటీ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన ఒప్పందమని, ఇండియాలో తమ సంస్థను పటిష్టం చేసుకోవడానికి ఈ ఒప్పందం ఎంతో దోహదపడుతుందని నోకియా సీఈవో రాజీవ్ సూరి అన్నారు. 130 కోట్లకు పైగా జనాభాతో, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం మార్కెట్ ఉన్న ఇండియాలో రానున్న ఐదేళ్లలో ఆన్‌లైన్ డిమాండ్ పెరగనుంది. మొబైల్ వినియోగదారుల సంఖ్య కూడా 92 కోట్లకు పెరుగుతుందని నోకియా అంచనా వేస్తోంది. ఇప్పటికే 5జీ మార్కెట్లోకి ప్రవేశించిన ఎరిక్సన్, హువావే సంస్థల నుంచి తీవ్రమైన పోటీ వల్ల గత అక్టోబర్‌లో ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఈ ఒప్పందం జరగడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంసమైంది.

కొత్త సీఈవో..

ఇటీవల నోకియా సంస్థ సీఈవో మార్పును ప్రకటించడానికి ముందు వెల్లడించిన ఫలితాల్లో నోకియా కంపెనీ 2015 తర్వాత 2019 సంవత్సరంలో తొలిసారిగా లాభాలను నమోదు చేసింది. 7 మిలియన్ యూరోల లాభాలను ప్రకటించి అంచనాలను అధిగమించింది. నోకియా ప్రెసిడెంట్‌గా, సీఈవోగా 25 ఏళ్ల నుంచి సేవలు అందించిన ఇండియా సంతతి రాజీవ్ సూరీ ఇటీవల ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ సంవత్సరం ఆగష్టు 31 తర్వాత ఆయన నోకియా సీఈవో పదవి నుంచి వైదొలగనున్నారు. రాజీవ్ స్థానంలో పెకా లుండామార్క్ పేరును నోకియా సంస్థ ఇది వరకే ఖరారు చేసింది.

Tags : Nokia, Nokia Bharti Airtel Deal, Bharti Airtel, Bharti Airtel 4G Network, Telecom Sector

Advertisement

Next Story

Most Viewed