చావైనా.. బతుకైనా దూరం దూరమే..!

by Sridhar Babu |
చావైనా.. బతుకైనా దూరం దూరమే..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్:
కరోనా వచ్చిందంటే అయినవాళ్లే దగ్గరకు రావడం లేదు. చనిపోయినా కూడా అంత్యక్రియలు చేయడం లేదు. ఆస్పత్రుల్లో చనిపోయిన వారిని గ్రామాల్లోకి రానివ్వడం లేదు. బతికి ఉన్నప్పుడు కలిసి మెలిసి తిరిగిన వారు కూడా కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది. ఇటీవల కరీంనగర్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి కరోనా లక్షణాలతో చనిపోతే అంత్యక్రియల కోసం మూడు చోట్లకు తరలించాల్సి వచ్చింది. చివరకు జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే తప్ప అంత్యక్రియలు జరగలేదు. అలాగే కరీంనగర్ విద్యానగర్‌కు చెందిన మరో వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణిస్తే ఆయన శవాన్ని దహనం చేసేందుకు అతడి బంధువులు కూడా రాకపోవడంతో ఆ ఏరియా కార్పొరేటర్ కుచ్చు రవి చొరవ తీసుకుని శవాన్ని వారి సాంప్రదాయం ప్రకారం దహనం చేయించారు.

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి కరోనాతో చనిపోతే అంత్యక్రియలకు ముగ్గురు కుటుంబ సభ్యులే నిర్వహించారు. గంగాధర మండలం గర్షకుర్తిలో చనిపోయిన మరో వృద్ధుడి విషయంలోనూ గ్రామస్తులు అభ్యంతరం చెప్పడంతో ప్రభుత్వ అధికారులే చొరవ తీసుకుని తంతు కానివ్వాల్సిన పరిస్థితి తయారైంది. సిరిసిల్ల జిల్లా వేములవాడలోనూ కరోనా పేషెంట్ చనిపోగా అతడి శవానికి అంత్యక్రియలు చేసేందుకు ఎక్కడికి తీసుకెళ్లినా అభ్యంతరం తెలిపారు. చివరకు మృతుడి బంధువులు శవాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌ను నడిరోడ్డుపై వదిలేసి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి అక్కడి మూలవాగులో అంత్యక్రియలు చేయించారు.

ఇలాంటి ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిత్యకృత్యంగా మారిపోయాయి. ఈ పరిస్థితి కేవలం కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారికే కాదు రాని వారు చనిపోయినా ఇలాంటి వ్యతిరేకతే ఎదురవుతోంది. చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కరోనా కాలం అంతక్రియలు నిర్వహించడం గగనంగా మారిపోయింది. అయితే చనిపోయిన తరువాత 4 నుంచి 5 గంటల వరకు మాత్రమే వారిలో కరోనా వైరస్ ఉంటుందని ఆ తరువాత చనిపోతుందని నిపుణులు చెప్తున్నప్పటికీ ఈ విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.

Advertisement

Next Story