బ్లాక్‌లో మద్యం అమ్మకాలు !

by Shyam |
బ్లాక్‌లో మద్యం అమ్మకాలు  !
X

దిశ, వరంగల్: కరోనా వైరస్‌ ప్రభావంతో ఏర్పడిన లాక్‌ డౌన్‌ను కొన్ని వ్యాపార వర్గాలు క్యాష్ చేసుకుంటున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెంచొద్దని, నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తామన్న ప్రభుత్వ ఆదేశాలతో సంబంధిత వ్యాపారులు యథావిధిగా విక్రయాలు జరుపుతున్నారు. అయితే మద్యం షాపులు మూసి వేయడంతో కొంతమంది వ్యాపారులు మాత్రం బ్లాక్‌లో విక్రయాలు సాగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. మద్యం ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని డబుల్‌ రేట్లు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు అంతా బాగానే ఉందని మిన్నకుండిపోతుండటం గమనార్హం.

కలిసొచ్చిన లాక్ డౌన్ !

కొంతమంది మద్యం వ్యాపారులకు లాక్ డౌన్ కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ నెల 22న జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్ షాపులు బందయ్యాయి. కానీ, అప్పటికే పెద్ద మొత్తంలో మద్యం డంప్ చేసుకున్న పలువురు వ్యాపారులు దోపిడీ దందాకు తెరలేపారు. బెల్ట్ షాపులే అడ్డాగా అధిక ధరలు నిర్ణయించి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. రూ. 110 ఉన్న లైట్ బీరును రూ. 250కి విక్రయిస్తున్నారు. అదే విధంగా క్వార్టర్ విస్కీ బాటిల్ ధర రూ. 130 ఉంటే రూ. 250 నుంచి 300 వరకు విక్రయిస్తున్నట్లు మందు బాబులు పేర్కొంటున్నారు. బ్రాండెడ్ విస్కీ ధరలైతే రూ. 3 నుంచి 4 వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ నగరంలోని ఉర్సు, కరీమాబాద్, ఎస్ఆర్ఆర్ తోట, రంగశాయిపేట, నాయుడు పంప్, హన్మకొండ నగరంలోని పెద్దమ్మగడ్డ, పెంబర్తి క్రాస్ రోడ్, సమ్మయ్య నగర్, తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ ఏరియాల్లో రోజువారీ కూలీలు, డ్రైవర్లు, రిక్షా కార్మికులు, మార్కెట్లో పని చేసే గుమస్తాలు ఎక్కువగా ఉండటం, వారంతా మద్యానికి బానిసలు కావడంతో వ్యాపారులు ఈ తరహా దోపిడీకి పాల్పడుతున్నట్లు ప్రచారంలో ఉంది.

ప్రధానంగా వరంగల్ నగరంలోని కొన్ని బార్లు రాత్రి వేళ ఓపెన్ చేసి మద్యం డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం స్థానిక ఎక్సైజ్ అధికారులకు తెలిసినప్పటికీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. మద్యం వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు ముడుతున్నందునే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags : Warangal, Bars, illegal Alcohol sales, Lockdown, Corona

Advertisement

Next Story

Most Viewed