ఐపీఎల్‌పై కరోనా ఎఫెక్ట్.. ఆందోళనలో మేనేజ్‌మెంట్..!

by Anukaran |   ( Updated:2021-03-27 08:32:57.0  )
ఐపీఎల్‌పై కరోనా ఎఫెక్ట్.. ఆందోళనలో మేనేజ్‌మెంట్..!
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ ప్రారంభానికి మరో 13 రోజులే ఉన్నది. ఇప్పటికే బీసీసీఐ ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం అన్ని రకాలు ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు ఫ్రాంచైజీలకు చెందిన జట్లు ఐపీఎల్ కోసం సన్నద్దం అవుతున్నాయి. కరోనా కారణంగా ఈ సారి కేవలం 5 వేదికలకే ఐపీఎల్‌ను పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడత (బూట్ 1) మ్యాచ్‌లో చెన్నై, ముంబయి నగరాలకు పరిమితం చేశారు. చెన్నైలో 10 మ్యాచ్‌లు, ముంబయిలో 10 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 25 వరకు ముంబయి వేదికగా 10 మ్యాచ్‌లు జరుగనుండగా.. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సారి ఏ జట్టు కూడా హోం గ్రౌండ్‌లో మ్యాచ్‌లు ఆడటానికి వీలు లేకపోవడంతో ముంబయి జట్టు అక్కడ ఆడటం లేదు. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూను విధించింది. దీంతో అక్కడ జరగాల్సిన మ్యాచ్‌లపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

ఇదీ ఇబ్బంది..

మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూను విధించింది. రాత్రి 8.00 గంటల లోపు మాల్స్, క్లబ్స్, ఇతర ప్రదేశాలను మూసేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 8 తర్వాత రోడ్లపై ఎలాంటి సంచారం ఉండకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. కాగా, ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. అయితే మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైరాత్రి 11.30 గంటలకు ముగుస్తాయి. ఆయా జట్లు మ్యాచ్ ముగిసిన తర్వాత తమకు కేటాయించిన హోటల్స్‌కు వెళ్లడానికి అర్దరాత్రి 12.00 గంటలు దాటుతుంది. కేవలం క్రికెటర్లు, సపోర్ట్ టీమ్ మాత్రమే కాకుండా బ్రాడ్‌కాస్టింగ్ సిబ్బంది, ఐపీఎల్ స్టాఫ్, గ్రౌండ్ సిబ్బంది కూడా తమ పనులు ముగించుకొని హెటల్స్‌కు చేరుకోవడానికి అర్దరాత్రి దాటిపోతుంది. ముంబయిలో రాత్రి కర్ఫ్యూ విధించి 8.00 గంటల తర్వాత ఎవరినీ అనుమతించకపోతే వీళ్లందరూ హోటల్స్‌కు చేరుకోవడం ఎలా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ప్రస్తుతానికైతే మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతులు లభించాయి. కానీ తాజాగా కర్ఫ్యూ ఉత్తర్వులతో ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తున్నది.

బయోబబుల్‌తో ఇబ్బంది లేదు..

ఐపీఎల్‌ను పూర్తి బయోబబుల్ వాతావరణలో నిర్వహిస్తున్నారు. ప్రతీ జట్టు ఒక ప్రత్యేక బబుల్‌లో ఉంటుంది. ఐపీఎల్ స్టాఫ్, బ్రాడ్‌కాస్టింగ్ స్టాఫ్‌కు వేరే బయోబబుల్స్ ఉంటాయి. ఒక బబుల్‌లో ఉండే వాళ్లకు.. ఇతరులతో సంబంధం ఉండదు. హోటల్ నుంచి స్టేడియం వరకు పూర్తిగా శానిటైజ్ చేసిన బస్సుల్లో ప్రయాణిస్తారు. ప్రతీ మూడు రోజులకు ఒకసారి అందరికీ కరోనా టెస్టులు కూడా నిర్వహించనున్నారు. కాబట్టి ఐపీఎల్ ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదని బీసీసీఐ అధికారులు తెలియజేస్తున్నారు. బయోబబుల్‌లో ఉండే వాళ్లు హోటల్, స్టేడియం తప్ప బయటకు వెళ్లే అవకాశం లేదు. కేవలం కర్ఫ్యూ సమయంలో బస్సు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

కాబట్టి ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కోరతామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతానికైతే వాంఖడేలో మ్యాచ్‌లకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు కలుగలేదని.. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని తెలుస్తున్నది. అయితే ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లపై బీసీసీఐ అధికారులు త్వరలోనే ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయినందు వల్ల వేదికను మార్చే వీలుండదని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed