పెళ్ళైన గంటల్లోనే వధూవరులు దుర్మరణం

by Shyam |   ( Updated:2020-12-11 05:16:51.0  )
పెళ్ళైన గంటల్లోనే వధూవరులు దుర్మరణం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్ధరు కలిసి బ్రతకాలి అనుకుని పెండ్లి చేసుకున్నారు. పెండ్లి చేసుకున్న ఆనంధంలో వరుడి ఇంటికి వెళ్లుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరికి ఇద్ధరు దుర్మరణం పాలైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని మోడేగాం గ్రామానికి చెందిన నవ దంపతులు ఈ ప్రమాదంలో మరణించారు.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన భట్టు సతీశ్(24) ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో క్యాటరింగ్ పని చేస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న ఠాకూర్ మహిమ అనే అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు గురువారం హైదరాబాద్‌లో వివాహం చేసుకుని బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి 9 గంటల ప్రాంతంలో బస్సు దిగి స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొని వెళ్లిపోగా ప్రమాద స్థలంలోనే మహిమ మృతి చెందింది. సతీశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన సదాశివ నగర్ పోలీసులు వారి వాహనంలో కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలైన సతీశ్‌‌ను నిజామాబాద్ తరలించగా రాత్రి 12 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story