ఏపీ బీజేపీకి నూతన అధ్యక్షుడు?

by Shyam |

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ జెండా పాతాలని భావిస్తోంది. ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని బీజేపీ చాలా కాలంగా ఆరాటపడుతోంది. అయితే ఆ పార్టీని సంస్థాగత సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. పార్టీ కోసం కేడర్ బలంగానే పని చేస్తున్నప్పటికీ ప్రజాకర్షక నేత లేని లోటు ఏపీలో ఆపార్టీని వేధిస్తోంది. నిన్న మొన్నటి వరకు అనామక పార్టీగా ఉన్న బీజేపీ రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఉనికిని చాటుకుంది.

మిత్రపక్షంతో విభేదాల కారణంగా 2019 ఎన్నికల్లో మాత్రం బొక్కబోర్లాపడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరిని మార్చినా బీజేపీకి కలిసిరావడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఆ పార్టీ అధ్యక్షుడ్ని మార్చాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తాజాగా మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగరరావు ఢిల్లీలో మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షులు రాబోతున్నారని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర నాయకత్వంలో మర్పులు తథ్యమని అనిపిస్తోందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో బీజేపీ పొత్త పెట్టుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలతో పోలిస్తే జనసేన బలహీనమైనదైనప్పటికీ.. బీజేపీతో పోలిస్తే మాత్రం బలమైన పార్టీగానే చెప్పాలి. అంతే కాకుండా జనసేనాని పవన్ కల్యాణ్ ఛరిష్మా కలిగిన సినీ, రాజకీయ ప్రముఖుడు. దీనిని బీజేపీ క్యాష్ చేసుకోగలిగితే ఏపీలో పాతుకుపోవచ్చే భావనలో ఉంది. దీంతో పవన్ కల్యాణ్‌కు అనుకూలమైన, అతనితో కలిసి నడవగల నేతను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని చేస్తే పార్టీకి లాభం ఉంటుందని అంచనావేస్తోంది.

ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణకు దూకుడైన నేత అనే ట్యాగ్ లైన్ లేకపోవడాన్ని ఆపార్టీ లోటుగా భావిస్తోంది. అందుకే ఆయనను తొలగించి, ఆయన స్థానంలో దూకుడుగా వెళ్లే నేతను రాష్ట్ర అధ్యక్షుడ్ని చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. దీంతో రాష్ట్ర నాయకత్వంలో మార్పులు తప్పవనే తెలుస్తోంది.

Advertisement

Next Story