పుట్టుకతోనే కరోనాను జయించి.. రికార్డు సృష్టించి..

by Sampath |
పుట్టుకతోనే కరోనాను జయించి.. రికార్డు సృష్టించి..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కిమ్స్ కడల్స్ డాక్టర్లు కరోనా బారిన పడిన ఓ గర్భిణికి మాతృత్వాన్ని ప్రసాదించి, నెలలు నిండకముందే ప్రసవించిన తన శిశువుకు ఊపిరి పోసి విజయవంతంగా తల్లి ఒడికి చేర్చారు. దీంతో హైదరాబాద్‌లోనే అతి పిన్న వయస్సులో కరోనాను గెలిచిన శిశువుగా ఆ నవజాత శిశువు రికార్డు సృష్టించాడు. హైదరాబాద్‌కు చెందిన 28 వారాల గర్భిణికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. కుటుంబ సభ్యులు కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి తరలించారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుండగా.. ఏప్రిల్ 17న నెలలు నిండని 1000 గ్రాముల బరువుగల నవజాత శిశువుకు ఆమె జన్మనిచ్చింది.

అయితే పుట్టిన నవజాత శిశువుకు ముందుగా కోవిడ్ టెస్ట్ చేయగా నెగటివ్ వచ్చింది. ఒక వారం రోజుల తర్వాత క్రమంగా శిశువు ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతోపాటు శిశువుకు శ్వాస తీసుకోవడం కష్టమై వెంటిలేటర్ అవసరం ఏర్పడింది. దాంతో శిశువుకు మరోసారి కరోనా పీసీఆర్ టెస్టు చేయగా పాజిటివ్‌గా తేలింది. దాంతో క్రమంగా శిశువు క్రమంగా బరువు 1000 నుంచి 920 గ్రాములకు తగ్గింది. ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో.. ఐసీయూకు తరలించి చికిత్సను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నవజాత శిశువుకు చికిత్సనందించిన తీరును కిమ్స్ కడల్స్ సీనియర్ కన్సల్టెంట్ నియోనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సి. అపర్ణ వివరించారు.

“నవజాత శిశువుపై మా డాక్టర్లు, నర్సుల బృందాలు ప్రత్యేక దృష్టి సారించి, ఐసోలేషన్ నియోనాటల్ ఐసీయూలో చికిత్స అందించారు. ముఖ్యంగా వెంటిలేటర్ సపోర్ట్, ఇంట్రావీనస్ యాంటీ బయాటిక్స్ ఇస్తూ ఆధునిక పద్ధతులలో ట్రీట్మెంట్ చేశారు. శిశువు బీపీ, ఆక్సిజన్ సాచురేషన్స్ చూపించే మల్టీ పారా మానిటర్లతో పర్యవేక్షించారు. అదే విధంగా ముక్కుకు వెంటిలేటర్ తో పాటు తరువాత సీపీఏపీ ( కంటిన్యూస్ పాటిజివ్ ఎయిర్వే ప్రెజర్) ద్వారా చికిత్సనందించారు. నవజాత శిశువు వేగంగా కోలుకోవడానికి అవసరమైన స్టిరాయిడ్లు కూడా వాడాం’’అని వివరించారు.

Advertisement

Next Story