ఎన్‌సీఏలోనే క్రికెట్ ప్రాక్టీస్..?

by Shyam |
ఎన్‌సీఏలోనే క్రికెట్ ప్రాక్టీస్..?
X

దిశ, స్పోర్ట్స్: కరోనా మూలంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఇండ్లకే పరిమితం అయిన క్రికెటర్లు త్వరలోనే శిక్షణ శిబిరంలోకి అడుగుపెడతారని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే క్రికెటర్లకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లోనే శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలోని మరో ఇతర గ్రౌండ్‌లో అయినా అదనంగా వైద్యులు, శిక్షణ పరికరాలు, ఇతర సిబ్బందిని ఏర్పాటు చేయాలి. కానీ ఎన్‌సీఏలో ఇప్పటికే పూర్తి స్థాయిలో శిక్షణ పరికరాలు, సిబ్బంది ఉన్నారు. అంతేగాకుండా ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కూడా క్రికెటర్లకు ముందుగా కౌన్సిలింగ్ క్లాసులు ఏర్పాటు చేయడం మంచిదని సూచించారు. గత రెండు నెలలుగా ఇంటికే పరిమితం అయిన క్రికెటర్ల మానసిక స్థితి ముందుగా ఆటకు సన్నద్దం చేయాలంటే నిపుణులైన కౌన్సిలర్లు ఎన్‌సీఏలో అందుబాటులో ఉన్నారు. అంతే కాకుండా ద్రవిడ్ వంటి సీనియర్ క్రికెటర్లు కూడా అందుబాటులో ఉండటం శిక్షణకు కలసివస్తుందని బీసీసీఐ భావిస్తోంది. అయితే కర్ణాటక ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తేనే ఇది సాధ్యమవుతోంది. మరోవైపు బెంగలూరుకు వెళ్లడానికి డొమెస్టిక్ విమానాలు అందుబాటులోకి వచ్చినా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో 14 రోజులు ఎవరినీ కలవకుండా క్రికెటర్లు ఎన్‌సీఏలో ఎలా ఉంటారనే విషయంపై కూడా బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. అక్కడ ఐసోలేషన్ క్యాంపులు నిర్వహించడం సాధ్యపడకపోతే.. ఎలాంటి క్వారంటైన్ అవసరం లేకుండా.. స్వరాష్ట్రాల్లోనే ప్రాక్టీస్ చేసుకునే ఏర్పాట్లు కూడా చేయడానికి మరో ఆప్షన్‌గా తీసుకుంటామని బీసీసీఐ చెబుతోంది.

Advertisement

Next Story

Most Viewed