Bangladesh Crisis: బంగ్లాదేశ్ కు రెండోసారి స్వాతంత్య్రం.. కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే

by Shamantha N |
Bangladesh Crisis: బంగ్లాదేశ్ కు రెండోసారి స్వాతంత్య్రం.. కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ రెండోసారి స్వాతంత్య్రాన్ని పొందిందని నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ అన్నారు. గురువారం మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫ్రాన్స్ నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చేరుకున్నారు. బంగ్లాదేశ్ రెండోసారి స్వాతంత్య్రం పొందని.. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని గుర్తుచేశారు. పౌరులందరికీ భద్రత కల్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రశాంతంగా ఉండాలని.. దేశనవనిర్మాణానికి తోడ్పడాలని ప్రజలను కోరారు. హింసా మార్గంలో పయనిస్తే.. విధ్వంసం తప్పదని హెచ్చరించారు.

వీసా సెంటర్ల మూసివేత

బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న వేళ అక్కడి భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేశారు. వీసా (Indian Visa) కోసం దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఒక సందేశం పెట్టారు. ‘‘ తదుపరి నోటీసులు వచ్చే వరకు బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా ఉన్న అన్ని వీసా దరఖాస్తు సెంటర్లను మూసివేస్తున్నాం. అస్థిర పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. మిగతా వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా సమాచారమిస్తాం’’ అని అందులో వెల్లడించారు. ఇప్పటికే బంగ్లాదేశ్ లోని భారత హైకమిషన్‌, కాన్సులేట్‌లో పనిచేసే అత్యవసర విధుల్లో లేని సిబ్బంది, వారి కుటుంబాలను ఢిల్లీకి తీసుకొచ్చారు. దౌత్యవేత్తలు మాత్రం బంగ్లాలోనే ఉంటారని, దౌత్య కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వ పేర్కొంది. కానీ, ఈ క్రమంలోనే తాజాగా వీసా సెంటర్లను మూసివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌కు ఢాకాలో హైకమిషన్‌తో పాటు చిట్టగాంగ్‌, రాజ్‌షాషీ, ఖుల్నా, సిల్‌హెట్‌ నగరాల్లో కాన్సులేట్లు ఉన్నాయి.

Advertisement

Next Story