బ్రిజ్‌భూషణ్‌ను ఎందుకు కాపాడుతున్నారు..?: ప్రియాంకా గాంధీ

by Mahesh |
బ్రిజ్‌భూషణ్‌ను ఎందుకు కాపాడుతున్నారు..?: ప్రియాంకా గాంధీ
X

న్యూఢిల్లీ: శనివారం ఉదయం రెజ్లర్ల ఆందోళనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మద్దతు తెలిపారు. రెజ్లర్లకు సంఘీభావంగా దీక్షలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌.. ప్రియాంకకు తమ సమస్యలను వివరించారు. బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని చెబుతున్న పోలీసులు.. ఇంతవరకు ఆ కాపీలను ఎందుకు బయటకు చూపించడం లేదని ప్రియాంక ప్రశ్నించారు. ఆ ఎఫ్‌ఐఆర్‌ కాపీలలో ఏముందో ఎవరికీ తెలియదన్నారు. " ఈ రెజ్లర్లు పతకాలను గెలిచినప్పుడు మనమంతా ట్విటర్‌లో పోస్ట్‌ చేసి గర్వపడ్డాం. ఇప్పుడు అదే క్రీడాకారులు న్యాయం కోసం రోడ్డెక్కారు. మహిళా రెజ్లర్లంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరో గత్యంతరం లేక ఇలా గొంతెత్తారు. కానీ ప్రభుత్వం మాత్రం వీరి ఆవేదనను వినకుండా బ్రిజ్‌భూషణ్‌ను ఎందుకు కాపాడాలని ప్రయత్నిస్తోంది?" అని ప్రియాంక కామెంట్ చేశారు.

" మహిళా రెజ్లర్ల సమస్యను ప్రధాని మోదీ పరిష్కరిస్తారన్న నమ్మకం లేదు. ఒకవేళ వీరి గురించి ఆయన ఆందోళన చెంది ఉంటే.. ఇంతవరకు రెజ్లర్లతో ఎందుకు మాట్లాడలేదు? కనీసం వీరిని కలవడానికి కూడా ఎందుకు ప్రయత్నించలేదు’’ అని ప్రియాంక ప్రశ్నించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ రాజీనామాకు డిమాండ్ చేశారు. బ్రిజ్ భూషణ్ పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేయడాన్ని రెజ్లర్లు స్వాగతించారు.

ఆయనను అన్ని పదవుల నుంచి తొలగించి అరెస్టు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఇక తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించిన బ్రిజ్ భూషణ్ సింగ్.. తాను నేరస్థుడిని కానని, పదవి నుంచి వైదొలగనని తేల్చి చెప్పారు. ఎలాంటి విచారణకైనా సహకరిస్తానని వెల్లడించారు. రాజీనామా చేస్తే ఆరోపణలను అంగీకరించడమే అవుతుందని తెలిపారు. ఆ రెజ్లర్ల ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని బ్రిజ్ భూషణ్ కామెంట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed