'ఢిల్లీ ప్రజలను అవమానించకండి'.. లెఫ్టినెంట్ గవర్నర్‌పై కేజ్రీవాల్ కౌంటర్

by Vinod kumar |
ఢిల్లీ ప్రజలను అవమానించకండి.. లెఫ్టినెంట్ గవర్నర్‌పై కేజ్రీవాల్ కౌంటర్
X

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనాకు మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. తాజాగా, ‘ఢిల్లీ 2041- న్యూ మాస్టర్ ప్లాన్’ అనే కార్యక్రమంలో ఎల్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆప్ అందిస్తున్న ఉచితాలపై పరోక్షంగా విమర్శిస్తూ, ఢిల్లీ ప్రజలు ఉచితాలకు అలవాటుపడ్డారని వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. సక్సేనా బయటి వ్యక్తి అని, ఆయనకు ఢిల్లీ ప్రజల బాధలు అర్థం కావని విమర్శించారు.

‘ఢిల్లీ ప్రజలు కష్టజీవులు. వారి కఠోర శ్రమతో ఢిల్లీని అందంగా తీర్చిదిద్దారు. ఎల్జీ సార్.. మీరు బయటి నుంచి వచ్చారు. మీకు ఢిల్లీ ప్రజల కష్టాలు అర్థం కావు. అనవసరంగా ఢిల్లీ ప్రజలను అవమానించకండి. ఆప్ ప్రభుత్వం ఇతరుల్లా దొంగతనం చేయడం లేదు. మేము డబ్బు ఆదా చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. దీనితో మీ బాధేంటి’ అని ప్రశ్నించారు. కాగా, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అనేక సబ్సిడీలతోపాటు ఉచిత విద్యుత్, ఉచిత నీరు అందిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed