PM Modi: క్లైమెట్ కమిట్‌మెంట్స్‌ను సాధించిన మొదటి జీ20 దేశంగా భారత్

by S Gopi |   ( Updated:2024-09-16 19:34:22.0  )
PM Modi: క్లైమెట్ కమిట్‌మెంట్స్‌ను సాధించిన మొదటి జీ20 దేశంగా భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: అభివృద్ధి చెందిన దేశాలు సాధించలేని ఘనతను అభివృద్ధి చెందుతున్న దేశమైన భారత్ సాధించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన నాల్గవ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (రీ-ఇన్వెస్ట్) 2024 కార్యక్రమంలో ప్రారంభ ప్రసంగం చేస్తూ.. నిర్దేశించిన తొమ్మిదేళ్ల గడువు కంటే ముందే పారిస్ క్లైమెట్ కమిట్‌మెంట్స్‌ను సాధించిన మొదటి జీ20 దేశంగా భారత్ నిలిచిందన్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నాం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీని ప్రజల ఉద్యమంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసేందుకు పీం సూర్య ఘర్ ముఫ్త్ మజిలీ యోజన పథకాన్ని కూడా తీసుకొచ్చామని మోడీ తెలిపారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూరుస్తున్నాము. ఇన్‌స్టాలేషన్ సాయం లభిస్తుందని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాతావరణ మార్పుల సమస్యలపై ప్రపంచం కంటే ముందే మహాత్మా గాంధీ ప్రస్తావించారని మోడీ అన్నారు. భూమిపై మన అవసరాలు తీరేందుకు తగినంత వనరులు ఉన్నాయని, మానవజాతి అత్యాశకు వెళ్లకూడదని చెప్పారు. ఈ క్రమంలో గ్రీన్ ఫ్యూచర్, నెట్ జీరో అనే మాటలు ఫ్యాన్సీ పదాలు మాత్రమే కాదు, అవి భారత నిబద్ధత అని ఆయన అన్నారు. దేశం సుస్థిరమైన ఇంధన మార్గాన్ని నిర్మించాలని కృతనిశ్చయంతో ఉందని, భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి సౌరశక్తి, పవన శక్తి, అణు, జలవిద్యుత్‌పై దృష్టి సారించిందని, రాబోయే 1000 సంవత్సరాలకు భారత్ పునాదిని సిద్ధం చేస్తోందని ప్రధాని మోడీ వెల్లడించారు.

Advertisement

Next Story