Kolkata Protesters: కోల్ కతాలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల నిరసన ప్రదర్శన

by Shamantha N |
Kolkata Protesters: కోల్ కతాలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల నిరసన ప్రదర్శన
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతాలో విద్యార్థుల నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనలు ఆందోళనకరంగా మారాయి. ‘పశ్చిమబంగా ఛాత్రో సమాజ్‌’ విద్యార్థి సంఘం.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ‘నబన్నా అభియాన్‌’ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే, వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడిక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి విద్యార్థులను నియంత్రించే ప్రయత్నం చేశారు. కాగా.. హౌరా బ్రిడ్జ్‌ వద్ద విద్యార్థులు బారికేడ్లను బద్దలు కొట్టారు. బారికేడ్లను చేతులతోనే లాగి పక్కకు పడేశారు. పోలీసులకుపైకి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనకారులపై పోలీసులు వాటర్ కెనాల్స్ వాడారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు విద్యార్థుల నిరసనల మధ్య సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

6 వేల మంది పోలీసులతో..

సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు మంగళవారం 'నబన్న అభిజన్' ( సెక్రటేరియట్ వరకు మార్చ్) పేరుతో నిరసనకు పిలుపునిచ్చాయి. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ భారీ ర్యాలీ జరగనుంది. ఈ నిరసన ప్రదర్శనలో హింస చేలరేగే అవకాశం ఉండడంతో కోల్‌కతా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్‌ వద్ద సుమారు 6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. బారికేడింగ్ కోసం 19 పాయింట్లు ఏర్పాటు చేశారు. దాదాపు 26 మంది డిప్యూటీ కమిషనర్లు వివిధ పాయింట్ల దగ్గర పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. హేస్టింగ్స్, ఫర్లాంగ్ గేట్, స్ట్రాండ్ రోడ్, హౌరా సహా ఇతర ప్రదేశాల్లో పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి.

Advertisement

Next Story

Most Viewed