Himanta Biswa Sarma: జార్ఖండ్ మాజీ సీఎం బీజేపీలోకి వస్తే బాగుంటుంది

by Shamantha N |
Himanta Biswa Sarma: జార్ఖండ్ మాజీ సీఎం బీజేపీలోకి వస్తే బాగుంటుంది
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సీనియర్ నాయకుడు చంపై సోరెన్‌ పై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు చంపై సోరెన్ బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. రాంచీలో మీడియాతో హిమంత మాట్లాడినప్పుడు.. చంపై సోరెన్ పార్టీ మార్పుపై స్పందించారు. 'చంపై సోరెన్ బీజేపీలో చేరి పార్టీని బలోపేతం చేయాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నా. ఆయన నాకన్నా చాలా సీనియర్. ఆయనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను’ అని ఆయన అన్నారు. గత ఆరు నెలలుగా చంపైతో తాను టచ్ లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపోతే, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కో-ఇన్ ఛార్జిగా హిమంత వ్యవహరిస్తున్నారు.

చంపైతో మాట్లాడతా..

చంపై ఢిల్లీలో ఉంటే మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని హిమంత అన్నారు. గత ఆరు నెలలుగా చంపైతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మాట్లాడుతున్నానని తెలిపారు. అయితే, ఆ సంభాషణల్లో మేం ఎప్పుడూ రాజకీయాల గురించి చర్చించలేదన్నారు. కాస్త రాజకీయాల గురించి కూడా చర్చించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అసోం సీఎం అన్నారు. ఇకపోతే, బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలను చంపై సోరెన్ కొట్టిపారేశారు. జేఎంఎం పార్టీని విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఆ దిశలో తాను కొత్త పార్టీని ఏర్పాటు చేయడం లేదా మరొక పార్టీలో చేరడం అనే రెండు ఎంపికలను అన్వేషిస్తున్నట్లు ఆయన నొక్కి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed