బంగ్లా హిందువులను బీఎస్ఎఫ్ తరిమేసింది

by John Kora |   ( Updated:2025-02-13 16:43:10.0  )
బంగ్లా హిందువులను బీఎస్ఎఫ్ తరిమేసింది
X

- సరిహద్దులో రక్షణ కోసం వచ్చిన హిందువులు

- బలవంతంగా పంపించేసిన భద్రతా బలగాలు

- యూఎన్ నిజనిర్ధారణ కమిటీ ముందు వెల్లడి

దిశ, నేషనల్ బ్యూరో: నిరుడు బంగ్లాదేశ్‌లో హింస చెలరేగిన సమయంలో హిందూ దేవాలయాలు, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకొని ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారని ఐక్యరాజ్య సమితి నిజ నిర్ధారణ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. ఆ సమయంలో మహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్‌లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం ఏ విధంగా హింసను ప్రేరేపించింది.. హింసను అరికట్టడంలో విఫలమయ్యిందో నిజ నిర్ధారణ కమిటీ వెల్లడించింది. ఈ విషయంలో భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ కూడా వేలాది మంది బంగ్లాదేశీ హిందువులను ఇండో-బంగ్లా బార్డర్ నుంచి వెనక్కు పంపించేసిందని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో 200లకు పైగా హింసాత్మక సంఘటనలు బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్నాయి. ఈ హింస ఐదుగురి మృతికి కారణమైంది. ఆగస్టు 5న షేక్ హసీనా దేశం వదిలి వెళ్లిపోయిన తర్వాత కొన్ని రోజులకే బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై దాడులు జరిగాయని పేర్కొంది. అప్పట్లో హిందువులపై దాడులను దుష్ప్రచారంగా యూనస్ పేర్కొన్నారు. కానీ ఆ దాడులు నిజమేనని యూఎన్ రిపోర్టులో తేలింది. ఆ సమయంలో బంగ్లాదేశ్‌లో హిందువులకు ఎలాంటి రక్షణ మార్గాలు కనిపించలేదు. దీంతో వేలాది మంది ఇండో-బంగ్లా బార్డర్ వద్దకు వెళ్లారు. కానీ బీఎస్ఎఫ్ దళాలు వారిని వెనక్కు తరిమేశాయని రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, బంగ్లాదేశ్‌లో అనేక మందితో మాట్లాడిన తర్వాత యూఎన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఈ రిపోర్టును సిద్ధం చేసింది. దాదాపు 4వేల మంది హిందువులు బార్డర్ వద్దకు చేరుకున్నారని.. కానీ బీఎస్ఎఫ్ వారిని అక్కడి నుంచి వెనక్కు పంపినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు నిజ నిర్ధారణ కమిటీకి తెలిపారు. అయితే వారందరూ బార్డర్ దాటి ఇండియాలోకి ప్రవేశించాలని ప్రయత్నించలేదని.. కేవలం బార్డర్ వద్ద రక్షణ మాత్రమే కోరుకున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

Next Story