Vande Bharat: వందే భారత్ స్లీపర్ ట్రైన్ అదుర్స్.. ట్రయల్ రన్‌లో 180 కేఎంపీహెచ్ అందుకున్న రైలు

by vinod kumar |
Vande Bharat: వందే భారత్ స్లీపర్ ట్రైన్ అదుర్స్.. ట్రయల్ రన్‌లో 180 కేఎంపీహెచ్ అందుకున్న రైలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన రైలు ప్రయాణాన్ని అందించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైలు(vande barath sleeper train) ను తీసుకొస్తు్న్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైన్ గత మూడు రోజులుగా నిర్వహించిన ట్రయల్స్‌లో గంటకు 180 కీలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 31 నుంచి ఈ ఏడాది జనవరి 2 వరకు ట్రయల్స్ చేపట్టినట్టు తెలిపారు. రాజస్థాన్‌లోని బుండి జిల్లాలోని కోటా, లాబాన్ మధ్య గురువారం 30 కిలోమీటర్ల ట్రయల్ రన్‌లో రైలు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని సాధించినట్టు పేర్కొన్నారు.

అంతకుముందు రోహల్ ఖుర్ద్, కోటా మధ్య 40 కిలోమీటర్ల పొడవైన ట్రయల్ రన్‌లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని సాధించింది. అలాగే అదే రోజు కోట-నాగ్డా, రోహల్ ఖుర్ద్-చౌమ్హాలా సెక్షన్లలో చేపట్టిన ట్రయల్స్‌లో గంటలకు 170 కిలోమీటర్లు, 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ప్రపంచ స్థాయి ప్రయాణాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు ఈ ట్రయల్స్ చేపట్టినట్టు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. లక్నోలోని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) పర్యవేక్షణలో ఈ ట్రయల్స్ ఈ నెల చివరి వరకు కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ట్రయల్స్ పూర్తైన తర్వాత రైల్వే సేఫ్టీ కమిషన్ రైలు గరిష్ట వేగాన్ని అంచనా వేస్తుంది. ఆ తర్వాత ట్రయల్స్ చివరి దశ దాటిన తర్వాత మాత్రమే వేగాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తారు. అనంతరం సర్వీస్ చేయడానికి రైల్వేలకు అప్పగిస్తారు.

Advertisement

Next Story