కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన శామ్ పిట్రోడా

by Dishanational1 |
కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన శామ్ పిట్రోడా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె ఆమోదించారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఈ నిర్ణయం ఆయన స్వయంగానే తీసుకున్నారని జైరాం రమేష్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇటీవల శామ్ పిట్రోడా వారసత్వ పన్నుపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్నికల వేళ ఇది మరింత వివాదాస్పదం అయింది. ఈ విషయం మరవకముందే తాజాగా జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయులు ఎలా కనిపిస్తారనే దానిపై ఆయన మాటలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. లోక్‌సభ ఎన్నికల హీట్ కొనసాగుతుండటంతో ఇది రాజకీయ వివాదాన్ని సృష్టించింది. దేశంలోని తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లాగా, పశ్చిమ వాసులు అరబ్బులుగా, ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులుగా, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లుగా ఉంటారన్నారు. ఈ వివాదం ఎన్నికలపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఆయన తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామంపై స్పందించిన జైరాం రమేష్.. భారతదేశంలోని ప్రజల మధ్య వైవిధ్యాన్ని వివరించే క్రమంలో శామ్ పిట్రోడా ఎంచుకున్న పోలికలు దురదృష్టకరంగా ఉన్నాయి. అవి ఆమోదయోగ్యం కాదు. దీన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఏ మాత్రం అంగీకరించదని' ట్వీట్ చేశారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ఆయన జాత్యహంకార వ్యాఖ్యలు దేశంలోని ప్రజలను జాతి, మతం, కులాల ప్రాతిపదికన విభిజించేలా ఉన్నాయని విమర్శించింది.

Next Story