Udhayanidhi Stalin : టార్గెట్ ‘2026’.. రంగంలోకి ఉదయనిధి.. డీఎంకే సర్వసన్నద్ధం

by Hajipasha |   ( Updated:2024-10-23 14:43:44.0  )
Udhayanidhi Stalin : టార్గెట్ ‘2026’.. రంగంలోకి ఉదయనిధి.. డీఎంకే సర్వసన్నద్ధం
X

దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అయినా 2026 ఎలక్షన్స్ కోసం డీఎంకేను సన్నద్ధం చేసేందుకు సీఎం స్టాలిన్ రాజకీయ వారసుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఇప్పటి నుంచే కసరత్తును ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు డీఎంకే అబ్జర్వర్లను నియమించడం ద్వారా ఎన్నికల సమరానికి ఆయన సన్నాహాలను మొదలుపెట్టారు. డీఎంకే అబ్జర్వర్ల ఎంపికలో ఉదయనిధి తనదైన ముద్రవేశారు. అబ్జర్వర్ల ఎంపికలో యువతకు ప్రాధాన్యమిచ్చారు. బూత్ స్థాయి నుంచి డీఎంకేను బలోపేతం చేయడంపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. డిప్యూటీ సీఎంగా, సీఎం స్టాలిన్ రాజకీయ వారసుడిగా, తమిళనాడు ప్రభుత్వంలో నంబర్ 2గా ఉదయనిధి తన ఉనికిని చాటుకుంటున్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కోసం నిజాయితీగా శ్రమించిన నేతలకు 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అబ్జర్వర్లుగా సేవలు అందించే అవకాశాన్ని కల్పించారు. లోక్‌సభ పోల్స్‌లో విఫలమైన దాదాపు 50 నుంచి 60 మంది నేతలకు ఉదయనిధి ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. తమిళనాడులోని యూత్‌ను టార్గెట్ చేస్తూ నటుడు విజయ్ ‘తమిజగ వెట్రి కజగం’ పార్టీని నెలకొల్పిన నేపథ్యంలో.. యువతను ఆకట్టుకునేలా డీఎంకేను ఆయన సన్నద్ధం చేస్తున్నారు. పార్టీలో యువరక్తం నింపేందుకు యత్నిస్తున్నారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి కె.పొన్ముడి (74) వద్ద ఉన్నత విద్యాశాఖ కూడా ఉండేది. వారం క్రితమే పొన్ముడి వద్దనున్న ఉన్నత విద్యాశాఖను తొలగించారు. ఈ నిర్ణయం వెనుక ఉదయనిధి ఉన్నారని తెలుస్తోంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొన్ముడికి కనీసం డీఎంకే అసెంబ్లీ టికెట్ ఇస్తారా లేదా అనే చర్చ మొదలైంది.

Advertisement

Next Story