యుద్ధాన్ని ఒక్కరోజులోనే ఆపేస్తానన్న ట్రంప్.. రష్యా ఏమందంటే?

by Shamantha N |
యుద్ధాన్ని ఒక్కరోజులోనే ఆపేస్తానన్న ట్రంప్.. రష్యా ఏమందంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా రియాక్ట్ అయ్యింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో పరిష్కరించే అంశం కాదని పేర్కొంది. ట్రంప్ ఒక్కరోజులో అలా చేయలేరని తెలిపింది. యుద్ధంలో రష్యన్లు, ఉక్రెయిన్లు వేలాది మంది మరణిస్తున్నారని 2023 మేలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్‌ తొలిసారి అన్నారు. తనకు అవకాశం లభిస్తే ఆ మారణహోమాన్ని 24 గంటల్లో ఆపేస్తానన్నారు. కాగా.. ఇదే విషయాన్ని ఆయన ఇటీవల చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో పదే పదే చెప్తున్నారు. గతవారం అధ్యక్షుడు బైడెన్‌తో జరిగిన చర్చలోనూ దీని ప్రస్తావన వచ్చింది. అమెరికాలోనే బలమైన అధ్యక్షుడు, పుతిన్‌ గౌరవం పొందగలిగే వ్యక్తి ఉండి ఉంటే అసలు ఉక్రెయిన్‌పై యుద్ధం జరిగేదే కాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావటంతో ట్రంప్‌ వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితిలోని రష్యా రాయబారి వాసిలీ నెబెంజా స్పందించారు.

పాశ్చాత్య దేశాలే ఒప్పందాన్ని చెడగొట్టాయి

ఏప్రిల్‌ 2022లో ఇస్తాంబుల్‌లో రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఒప్పందం దాదాపు ఖరారు దశకు చేరిందని నెబెంజా వెల్లడించారు. ఆ ఒప్పందం పూర్తయ్యుంటే యుద్ధం అప్పుడే ముగిసి ఉండేదని తెలిపారు. కానీ, ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న పాశ్చాత్య దేశాలే ఆ ఒప్పందాన్ని చెడగొట్టాయని ఆరోపించారు. రష్యాతో పోరాటం కొనసాగించాలని కీవ్‌ను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. అవన్నీ మరిచిపోయి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పుడు ‘శాంతి ఒప్పందం’ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. పుతిన్‌ ప్రతిపాదించినట్లుగా ఉక్రెయిన్‌ వెంటనే కాల్పుల విరమణకు ముందుకు రావాలని నెబెంజా అన్నారు. 2022లో రష్యా ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఆ దేశ బలగాలను ఉపసంహరించుకోవాలని సూచించారు. నాటో కూటమిలో చేరబోమని హామీ ఇవ్వాలని తెలిపారు. అప్పుడే యుద్ధం ముగింపు దిశగా మార్గం సుగమం అవుతోందన్నారు. ఇకపోతే, పుతిన్‌ ప్రతిపాదనను జెలెన్‌ స్కీ తిరస్కరించారు. తమ భూభాగాన్ని పూర్తిగా అప్పగించాల్సిందేనని పట్టుబట్టారు.

Next Story

Most Viewed