‘మహా’ సచివాయంపై నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు

by Mahesh Kanagandla |
‘మహా’ సచివాయంపై నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ అంశం ఆందోళనల నుంచి న్యాయపరమైన అంశాలతో కోర్టుల పరిధిలో ఉండగా.. ఇప్పుడు మరో సముదాయం రిజర్వేషన్ అంశం ముందుకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కొత్తగా ధన్‌గర్ రిజర్వేషన్ డిమాండ్ హీటెక్కిస్తున్నది. తమను ఎస్టీ కోటాలో చేర్చాల్సిందేనంటూ ధన్‌గర్ సముదాయం తీవ్ర నిరసనలు చేయగా.. ఆ డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ ఏకంగా అధికార పక్ష ఎమ్మెల్యేలే ఆందోళనకు దిగారు. ధన్‌గర్‌లను ఎస్టీ కోటాలో చేర్చవద్దంటూ అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు మహారాష్ట్ర సచివాలయం పై నుంచి దూకేశారు. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సారథ్యంలో పలువురు ట్రైబల్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. శుక్రవారం మహారాష్ట్ర సచివాలయం ఏడో అంతస్తు నుంచి దూకేయగా.. మూడో అంతస్తులో కట్టిన సేఫ్టీ నెట్ పై పడిపోయారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మెడకు తీవ్ర గాయమైన జిర్వాల్‌ను వెంటనే జేజే హాస్పిటల్ తరలించారు.

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను తెలియజేయడానికి సీఎం ఏక్‌నాథ్ షిండేతో భేటీ కోసం గిరిజన ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన డిప్యూటీ స్పీకర్ జిర్వాల్ సీఎం షిండేను కలవడానికి సహ్యాద్రిలోని గెస్ట్ హౌజ్‌కు వెళ్లగా ఆయన కలువలేదు. కొన్ని గంటలపాటు ఎదురుచూసిన జిర్వాల్.. మిగిలిన ట్రైబల్ ఎమ్మెల్యేలతో తన నిరసనను ఉధృతం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మహారాష్ట్ర సచివాలయం చేరుకున్నారు. ఒక వైపు సీఎం షిండే, కేబినెట్ మంత్రులతో భేటీలో ఉండగానే ట్రైబల్ ఎమ్మెల్యేలు సచివాలయం పై నుంచి దూకారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని, తమ సమస్యలు వినడానికి సీఎం షిండే సమయం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. జిర్వాల్‌ వెంట ఎన్సీపీ ఎమ్మెల్యే కిరణ్ లహమాతే, బహుజన్ వికాస్ అఘాదీ ఎమ్మెల్యే రాజేశ్ పాటిల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే హిరామన్ ఖోస్కర్, బీజేపీ ఎమ్మెల్యే హేమంత్ సావ్రాలు కూడా దూకేశారు.

ప్రస్తుతం ధన్‌గర్లు నొమడిక్ ట్రైబ్ కేటగిరీలో ఉన్నారు. ఈ కేటగిరీలో వారికి ప్రభుత్వ విద్యా, ఉద్యోగావకాశాల్లో 3.5 శాతం రిజర్వేషన్ దక్కుతున్నది. ఎస్టీ కేటగిరీలో చేరిస్తే వీరికి ఈ రిజర్వేషన్ కోటా 7 శాతానికి పెరగనుంది. కానీ, తమ రిజర్వేషన్‌కు గండి పడుతుందని ఎస్టీ కేటగిరీ సముదాయాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎస్టీ వర్గానికి చెందిన భిన్న పార్టీల ఎమ్మెల్యేలు ఆందోళనలు చేస్తున్నారు.

Advertisement

Next Story