Kalindi Express: కాళింది ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం

by Shamantha N |
Kalindi Express: కాళింది ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్‌కు (Kalindi Express) ప్రమాదం జరిగింది. కాన్పూర్‌లోని అన్వర్‌గంజ్-కాస్‌గంజ్ రైలు మార్గంలో పట్టాలపై ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను ఢీకొట్టింది. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాళింది ఎక్స్‌ప్రెస్‌ యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ నుంచి కాన్పూర్‌ సెంట్రల్‌ మీదుగా హర్యానాలోని భివానీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి శివరాజ్‌పూర్‌ ప్రాంతంలో రైలు పట్టాలపై ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించిన లోకోపైలట్‌ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. అప్పటికే రైలు సిలిండర్‌ను ఢీకొట్టింది. కాన్పూర్ పోలీసులు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ATS) ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎల్ పీజీ సిలిండర్ తో పాటు పెట్రోల్ బాటిల్, పేలుడు పదార్థాలు, అగ్గిపెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో దాదాపు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. విచారణ కోసం మళ్లీ కాన్పూర్‌లోని బిల్హౌర్ స్టేషన్‌లో నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు.

కేసు నమోదు

ఈ ఘటనపై కాన్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఐదు పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. కాన్పూర్ అదనపు పోలీసు కమిషనర్ హరీష్ చందర్ మాట్లాడుతూ.. "ప్రయాగ్‌రాజ్ నుండి భివానీకి వెళ్తున్న రైలు గ్యాస్ సిలిండర్‌ను ఢీకొట్టిందని రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సీనియర్ అధికారులు, ఫోరెన్సిక్స్ బృందం సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. పోలీసులు పాడైన సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసుని దర్యాప్తు చేస్తున్నాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము.” అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed