‘కొవాగ్జిన్’‌పై బనారస్ వర్సిటీ రిపోర్టు తప్పులతడక : ఐసీఎంఆర్

by Hajipasha |
‘కొవాగ్జిన్’‌పై బనారస్ వర్సిటీ రిపోర్టు తప్పులతడక : ఐసీఎంఆర్
X

దిశ, నేషనల్ బ్యూరో : కొవాగ్జిన్ కరోనా టీకాపై ఇటీవల బ‌నార‌స్ హిందూ విశ్వ‌విద్యాల‌యం(బీహెచ్‌యూ) విడుదల చేసిన నివేదిక కలకలం క్రియేట్ చేసింది. టీకా వేసుకున్న వారిని ఆందోళనకు గురి చేసింది. ‘‘కొవాగ్జిన్ తీసుకున్న వారిలో 30 శాతం మందికి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి’’ అని పేర్కొంటూ బీహెచ్‌యూ రూపొందించిన స్టడీ రిపోర్ట్ ‘స్ప్రింగ‌ర్ నేచ‌ర్’ జ‌ర్న‌ల్‌లో పబ్లిష్ అయింది. దీనిపై తాజాగా సోమవారం ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ రాజీవ్ భ‌ల్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవాగ్జిన్ టీకా సైడ్ ఎఫెక్టులపై ప్ర‌చురించిన నివేదిను ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. ఆ అధ్యయనం కోసం వినియోగించిన మెథ‌డాల‌జీ, డిజైన్‌ సరిగ్గాలేదని విమ‌ర్శించారు. బీహెచ్‌యూ నివేదిక త‌ప్పుదోవ ప‌ట్టించేలా ఉంద‌ని రాజీవ్ భల్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి, వ్యాక్సిన్ వేసుకోని వారి మ‌ధ్య తేడాను ఆ స్ట‌డీ తేల్చ‌లేక‌పోయింద‌న్నారు. అందుకే కొవిడ్ 19 వ్యాక్సినేష‌న్‌తో బీహెచ్‌యూ రూపొందించిన కొవాగ్జిన్ రిపోర్టును పోల్చి చూడలేమని స్పష్టం చేశారు. కొవాగ్జిన్ టీకాపై బీహెచ్‌యూ నిర్వహించిన అధ్యయనానికి తాము ఎటువంటి ఆర్థిక సాయం కానీ, సాంకేతిక సాయం కానీ అందించ‌లేద‌ని ఐసీఎంఆర్ డీజీ రాజీవ్ భల్ తేల్చి చెప్పారు. స్టడీ రిపోర్టులోని లోపాలపై సంబంధిత ర‌చ‌యిత‌ల‌కు, ఆ జ‌ర్న‌ల్ ఎడిట‌ర్‌కు లేఖ రాశామని ఆయన వెల్లడించారు. బీహెచ్‌యూ నివేదికకు ఐసీఎంఆర్ గుర్తింపు లభించిందనే అంశాన్ని తొలగించామని కోరినట్లు చెప్పారు. కొవాగ్జిన్ రిపోర్టుపై ఐసీఎంఆర్ వివ‌ర‌ణ‌ను కూడా ప‌బ్లిష్ చేయాల‌ని కోరామన్నారు.

Advertisement

Next Story