Tomato: టమాటా రేట్ల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం..

by Vinod kumar |
Tomato: టమాటా రేట్ల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం..
X

న్యూఢిల్లీ : టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయికి పెరుగుతున్నాయి. ఇప్పటికే సెంచరీ దాటిన టమాట ధర.. ఇప్పుడు డబుల్ సెంచరీ వైపు పరుగులు తీస్తుండటంతో సామాన్యులకు గుండెదడ మొదలైంది. వంటల్లోకి టమాట ఉపయోగించడం తగ్గిపోయింది. టమాటాల్ని ఎత్తుకెళ్తున్న ఘటనలూ పెరిగిపోయాయి. ఇలా భారీగా పెరిగిపోతున్న టమాట ధరల్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాటాలను సేకరించిన.. వాటి రిటైల్ ధరలు భారీగా పెరిగిన ప్రాంతాల్లో పంపిణీ చేయాలని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సీసీఎఫ్) సంస్థల్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆదేశించింది. ఈ విధంగా సేకరించే టమాటాల్ని గత నెలలో రిటైల్ ధరలు భారీగా పెరిగిన ప్రాంతాలకు సరఫరా చేయాలని తెలిపింది.

ఈ ఏర్పాటు ద్వారా శుక్రవారం నాటికి ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని వినియోగదారులకు తగ్గింపు రేట్లకే టమాటలు లభించబోతున్నాయి. టమాటా పంటను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పండిస్తుంటారు. అయితే భారతదేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో దీని దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం భారతదేశ టమాటా ఉత్పత్తిలో 56-58% వాటాను కలిగి ఉంది. దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లోని టమాటా మిగులు కలిగిన రాష్ట్రాలు, సీజన్‌లను బట్టి ఇతర మార్కెట్‌లకు టమాటల్ని సరఫరా చేస్తుంటాయి. టమాట ఉత్పత్తి సీజన్లు కూడా ప్రాంతాల వారీగా విభిన్నంగా ఉంటాయి. టమాటా పంట కాలం ప్రధానంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఉంటుంది. జూలై-ఆగస్టు, అక్టోబరు-నవంబర్ కాలాలు సాధారణంగా టమాటాలు తక్కువగా ఉత్పత్తి అయ్యే నెలలు.

అయితే జూలైలో వర్షాలు కురుస్తుంటాయి కాబట్టి, పండిన టమాటల్ని రవాణా చేయడం కష్టమవుతుంది. ఫలితంగా ఉత్పత్తి ఉన్నా ధరలు పెరుగుతాయి. నాట్లు, కోత కాలాలు సైతం ప్రాంతాలవారీగా భిన్నంగా ఉంటాయి. టమాట ధరల్లో పెరుగుదలకు దీన్ని కూడా ఒక కారణంగా చెబుతుంటారు. టమాటల రవాణాకు తాత్కాలికంగా ఏర్పడే అంతరాయాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కూడా ఆకస్మికంగా ధరలు పెరుగుతుంటాయి. ప్రస్తుతం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లకు సరఫరాలు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఉంటాయి.

ముఖ్యంగా సతారా, నారాయణంగావ్, నాసిక్ నుంచి ఈ నెలాఖరు వరకు టమాటలు వస్తాయని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెకు కూడా టమాటాలు బాగానే వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలోని కోలార్ నుండి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌కు టమాటాలు రవాణా అవుతుంటాయి. నాసిక్ జిల్లా నుంచి త్వరలో కొత్త పంటలు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టులో నారాయణగావ్, ఔరంగాబాద్ బెల్ట్ నుంచి అదనపు సరఫరా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి త్వరలోనే ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story