అమేథీలో కాంగ్రెస్ కార్యాలయంపై దుండగుల దాడి: పలు వాహనాలు ధ్వంసం

by Dishanational2 |
అమేథీలో కాంగ్రెస్ కార్యాలయంపై దుండగుల దాడి: పలు వాహనాలు ధ్వంసం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆఫీస్ వద్ద పార్క్ చేసి ఉన్న పలు కార్లను ధ్వంసం చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో గందరగోళం సృష్టించి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఈ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాంగ్రెస్ శ్రేణులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు సీనియర్ పోలీస్ అధికారి ద్వివేదీ తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. కారు అద్దాలు పగులగొడుతున్న వీడియోలను షేర్ చేసింది.

ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఈ దాడికి పాల్పడ్డారని మండిపడింది. బీజేపీ గూండాలు తమ కార్యకర్తలపై కూడా దాడికి పాల్పడ్డారని తెలిపింది. ‘అమేథీలో స్మృతి ఇరానీ, బీజేపీ కార్యకర్తలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఓటమిని ముందే ఊహించారు. అందుకే గూండాలు కర్రలు, రాడ్లతో అమేథీలోని కాంగ్రెస్ కార్యాలయం వెలుపలకు చేరుకుని అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఇది అమేథీ ప్రజలపై జరిగిన ఘోరమైన దాడి’ అని పేర్కొంది. ఇంత విధ్వంసం జరుగుతున్న పోలీసులు ప్రేక్షత పాత్ర పోషించారని విమర్శించింది. అమేథీలో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందనడానికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొంది.

మరోవైపు ఈ దాడిపై బీజేపీ స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి మాట్లాడుతూ.. అమేథీ లోక్‌సభ స్థానానికి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ డర్టీ ట్రిక్స్ ఉపయోగిస్తోందని తెలిపారు. సానుభూతితో ఓట్లను పొందేందుకు ప్రయత్నించేస్తోందని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కార్లను ధ్వంసం చేసిన వారి పేర్లను బహిరంగ పర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. కాగా, అమేథీ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున కిశోరీలాల్ శర్మ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed