Bomb Threats: గడిచిన 24 గంటల్లో మూడు విమానాలకు బెదిరింపులు

by Shamantha N |
Bomb Threats: గడిచిన 24 గంటల్లో మూడు విమానాలకు బెదిరింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులు రోజురోజుకు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో మూడు విమానాలకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (IX 196) విమానం 189 మంది ప్రయాణికులతో దుబాయ్‌ నుంచి జైపుర్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో ఆ విమానానికి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని జైపుర్‌లో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ఫ్లైట్ ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఎటువంటి అనుమానస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు బెంగళూరు నుంచి ముంబయికి వెళ్లేందుకు టేకాఫ్‌కు సిద్ధమైన ఆకాశ ఎయిర్‌లైన్స్‌ (QP1366) విమానానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తనిఖీల్లో ఆ బెదిరింపు కూడా బూటకమే అని తేలింది.

దాదాపు 30కి పైగా విమనాలకు బెదిరింపులు

ఇకపోతే, ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్తున్న విస్తారా (UK17) విమానానికి కూడా బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ విమానాన్ని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. కాగా.. గడిచిన వారం రోజుల్లో దాదాపు 30కి పైగా విమానాలకు ఇంటువంటి బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కల్గిస్తుంది. ఈ బెదిరింపులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైంది. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై నిషేధం విధించే అవకాశం ఉందని పౌర విమానయానశాఖ తెలిపింది. అలానే, నిబంధనల్లో మార్పులు చేయాల్సి ఉందని పేర్కొంది.

Advertisement

Next Story