ఎండపల్లిలో కాలజ్ఞానం నిజమైంది...

by Sridhar Babu |
ఎండపల్లిలో కాలజ్ఞానం నిజమైంది...
X

దిశ, వెల్గటూర్ : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం నిజమైంది. తెలంగాణలో తాటికల్లు మహా ఫేమస్. అదే విధంగా ఈత కల్లు కూడా లభిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కొబ్బరి కల్లు కూడా గీస్తారు. కానీ ఇక్కడి చింత చెట్టుకు కల్లు కారుతుంది. దాంతో ఇదంతా అమ్మవారి మాయే అంటూ కొందరు చెట్టుకు పూజలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని ఓ కూడలి వద్ద సుమారు వంద ఏళ్లకు పైగా వయసు గల ఓ చింత చెట్టు ఉంది. అకస్మాత్తుగా ఈ చింత చెట్టు కు రెండు రోజులుగా కల్లు పారుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు.

ప్రతి ఏటా ఇదే చింత చెట్టు కింద వినాయకుడి తో పాటు దుర్గా మాత విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. కాగా ఈ ఏడాది వినాయక చవితి, దసరా నవరాత్రుల కోసం చింత చెట్టు కొమ్మలను నరికి వేశారు. ఇది జరిగి దాదాపుగా 20 రోజులకు పైనే అవుతుంది. గత రెండు రోజుల నుంచి నరికిన ఓ కొమ్మ నుంచి కల్లు లాంటి తెల్లటి నీరు వస్తుంది. దాంతో చెట్టుకొమ్మకు ప్లాస్టిక్ బాటిల్ కట్టడంతో తెల్లటి ద్రవం నిండింది. ఈ విషయం తెలిసి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే చింత చెట్టుకు కల్లు పారుతుందని చర్చించుకుంటున్నారు. మరి కొందరు కలియుగాంతానికి సమయం దగ్గర పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇదంతా దుర్గామాత మాయే అంటూ ప్రచారం చేస్తున్నారు.

Advertisement

Next Story