మావోయిస్టు అగ్రనేత సుజాత అరెస్టు అబద్దం : మావోయిస్టు పార్టీ ప్రకటన‌

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-19 12:35:26.0  )
మావోయిస్టు అగ్రనేత సుజాత అరెస్టు అబద్దం : మావోయిస్టు పార్టీ ప్రకటన‌
X

దిశ, వెబ్ డెస్క్ : మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యురాలు కామ్రేడ్ సుజాత ఎలియాస్ మైనా భాయి అరెస్టయ్యిందంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ ఖండించింది. ప్రజలపై మానసిక దాడులు చేస్తూ, భయాందోళనలు సృష్టించడానికే సుజాత అరెస్టు అయినట్లుగా బూటకపు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ దక్షిణ్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత ఓ ప్రకటన విడుదల చేశారు. అరెస్టు దుష్పాచారం ప్రభుత్వాలు పన్నిన కుట్ర మాత్రమేనని స్పష్టం చేసింది. 2026 మార్చి వరకు మావోయిస్టులను నామ‌ రూపాలు లేకుండా చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ డెడ్ లైన్ మేరకు ఉద్యమంపై, ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటున్న వారిపై సామ, దాన, దండోపాయాలు అమలు చేస్తున్నారని పేర్కొంది. పార్టీపై దుష్ప్రచారం, అబద్దాలు, వక్రీకరణాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించింది. అందులో భాగంగానే ప్రజలపై మానసిక దాడులు చేస్తూ, భయాందోళనలు సృష్టించడానికి సుజాత అరెస్టు అయినట్లుగా బూటకపు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు భయాందోళనలకు గురి కావాలస్సిన అవసరం ఏమీలేదని ప్రకటనలో తెలిపింది. పీడిత ప్రజల నాయకత్వంపై కొనసాగిస్తున్న దుష్ప్రచారాన్ని, ప్రజల్లో గందర గోళాన్ని సృష్టించ‌డాన్ని తక్షణం నిలిపి వేయాలని కోరింది.

తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కై కార్పోరేట్ల ప్రయోజనాలకు కొమ్ము కాస్తుందని, ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి, చత్తీస్ గడ్ లో కార్పోరేట్ల కోసమే పని చేస్తున్నమని బాహటంగా చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి పార్టీ నిర్మూలనలో క్రీయాశీలంగా వ్యవహరిస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. కేవలం సామ్రాజ్యవాదుల, కార్పోరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి నిరోధక పథకానికి తెలంగాణ రాష్ట్ర అనుమతులతో దామగుండంలో VLF రాడార్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని విమర్శించింది. ఫలితంగా జీవనాడి లాంటి అడవులు, అనేక ఔషధ మొక్కలు, జంతుజాలం, ఉజ్జ్వలమైనా జీవ వైవిధ్యం వింద్వంసం కాబడుతున్నాయని, 20 గ్రామాలు, ఈ గ్రామాలలో నివసించే 60,000 వేల మంది ప్రజలు నిర్వాసితులు అయి చెల్లాచెదురు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. సైనిక కగార్ ఆపరేషన్ ను తక్షణం నిలిపి వేయాలనీ, దండకారణ్యంలో శాంతిని నెలకొల్పాలని పోరాడాలని, దేశ సంపదను కాపాడుకోవాలని పిలుపునిచ్చింది.

Advertisement

Next Story