అవి మోడీ మీడియా పోల్స్: ఎగ్జిట్ పోల్స్‌పై తొలిసారి స్పందించిన రాహుల్

by vinod kumar |
అవి మోడీ మీడియా పోల్స్: ఎగ్జిట్ పోల్స్‌పై తొలిసారి స్పందించిన రాహుల్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలైన అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. అవి ఎగ్జిట్ పోల్స్ కాదని..మోడీ పోల్స్ అని అభివర్ణించారు. జూన్ 4న వ్యూహంపై చర్చించేందుకు దేశ రాజధానిలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. శనివారం వెల్లడైనవి ఎగ్జిట్ పోల్స్ కాదని..మోడీ మీడియా పోల్స్ అని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించబోతోందని, 295 సీట్లకు పైగా గెలుచుకోబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడుతూ..ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తర్వాత ఇండియా కూటమి 295 కంటే ఎక్కువ సీట్లను గెలచుకోబోతుందని స్పష్టంగా అర్థమైందన్నారు. దీనిని ఖర్గే ప్రజల సర్వేగా అభివర్ణించారు.

కొన్ని నెలల ముందే సిద్ధం చేశారు: అఖిలేష్ యాదవ్

ఎగ్జిట్ పోల్స్ కొన్ని నెలల ముందే సిద్ధం చేశారని, ఇప్పుడు టీవీ చానెల్‌లలో మాత్రమే చూపబడుతున్నారని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్‌ను ఉపయోగించి సోమవారం ప్రారంభమయ్యే షేర్ మార్కెట్ నుంచి బీజేపీ లబ్ధి పొందాలని కోరుకుంటోందని, బీజేపీ నాయకులు నిరాశ చెందినట్టు వారి ముఖాల్లో స్పష్టంగా కనపడుతోందన్నారు. కౌంటింగ్ రోజు ఈవీఎంలను నిశితంగా పరిశీలించాలని, ఎస్పీ అభ్యర్థులు, వారి పోలింగ్ ఏజెంట్లకు పిలుపునిచ్చారు. ‘ఎగ్జిట్ పోల్ కాలక్రమాన్ని అర్థం చేసుకోండి. బీజేపీ అనుకూల మీడియా బీజేపీకి 300 సీట్లు దాటాయి చెబుతోంది. దీని ద్వారా మోసాలకు పాల్పడే అకాశం ఉంది’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed