Court: అక్టోబర్ 1 వరకు దేశవ్యాప్తంగా కూల్చివేతలపై స్టే

by Harish |
Court: అక్టోబర్ 1 వరకు దేశవ్యాప్తంగా కూల్చివేతలపై స్టే
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో చాలా రాష్ట్రాల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లు, ఇతర స్థిర ఆస్తులను బుల్డోజర్ ద్వారా ధ్వంసం చేస్తున్న విషయం ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ కేసులో కీలక ఆదేశాలు ఇచ్చింది. అక్టోబర్ 1వ తేదీ వరకు దేశవ్యాప్తంగా బుల్డోజర్ కూల్చివేతలపై స్టే విధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పబ్లిక్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ స్థలాలు, రైల్వే వంటి స్థలాల్లో అనుమతి లేకుండా ఉన్నటువంటి కట్టడాలను మాత్రం తొలగించవచ్చని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇది అమల్లో ఉంటుందని జస్టిస్‌లు బీఆర్‌ గవై, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల ఇళ్లు, ఇతర ఆస్తులను బుల్డోజర్ ద్వారా ధ్వంసం చేసే చర్యలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, అక్టోబర్ 1 వరకు స్టే విధిస్తే, ఇప్పటికే ప్రారంభమైన పనులపై ప్రభావం పడుతుందని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై కోర్టు బదులిస్తూ, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పనులు ఆగినంత మాత్రన కొంపలేం మునిగిపోవు. అక్రమ కట్టడాలను కూల్చే పేరుతో బుల్డోజర్ చర్యలను హీరోయిజంగా చూపే యత్నం చేయవద్దని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed