ఎన్నికల ఫలితం నేడే.. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

by Hajipasha |
ఎన్నికల ఫలితం నేడే.. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
X

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఈ ఉత్కంఠకు ఇంకొన్ని గంటల్లో తెరపడనుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి నెగ్గుతుందా ? కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి గెలుస్తుందా ? అనే దానిపై ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్స్‌లోనే క్లారిటీ రానుంది. ఏ రాజకీయ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతోంది అనే దానిపైనా ఆలోగా స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన మొత్తం 8,360 మంది అభ్యర్థుల భవితవ్యం మంగళవారం రోజు తేలిపోనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 175, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలతో పాటు పలు ఉప ఎన్నికల రిజల్ట్ కూడా విడుదలకానున్నాయి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల మంది ఓటువేశారు.

స్ట్రాంగ్ రూమ్స్ నుంచి వీవీ ప్యాట్ దాకా..

ఓట్ల లెక్కింపు ఘట్టంలో భాగంగా తొలుత మంగళవారం ఉదయం 5.30 గంటలకే ఈవీఎంలు భద్రపర్చిన అన్ని స్ట్రాంగ్ రూమ్స్ తెరుచుకోనున్నాయి. ఓటరు మహాశయులు ఏ తీర్పు ఇచ్చారనేది తెలుసుకునేందుకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపును మొదలుపెడతారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. వీటి కౌంటింగ్ మొదలుపెట్టిన 30 నిమిషాల తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్లను లెక్కించడం మొదలుపెడతారు. అన్నిచోట్లా తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలనే ప్రకటిస్తారు. ఆ తర్వాత రౌండ్ల వారీగా ఈవీఎం ఓట్ల లెక్కలను విడుదల చేస్తారు. ఒకవేళ ఏదైనా నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లేకుంటే.. తొలుత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపును మొదలుపెడతారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి ఐదు పోలింగ్‌ స్టేషన్లను ర్యాండమ్‌గా ఎంపిక చేసుకొని.. వాటిలోని ఒక్కో వీవీప్యాట్‌‌కు సంబంధించిన ఓటు స్లిప్పులను లెక్కిస్తారు. ఉదయం 9 గంటల నుంచి ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ బయటికి రావడం మొదలవుతుంది. మధ్యాహ్నం 2 గంటల్లోగా మెజారిటీ ట్రెండ్‌.. రాత్రి 8 గంటల్లోగా పూర్తి ఫలితాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఈసారి ఎన్నికల వేళ అత్యధిక హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న రాష్ట్రం బెంగాల్. దీంతో బెంగాల్‌లోని 55 ఓట్ల లెక్కింపు కేంద్రాలకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. 92 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను వాటి పరిసరాల్లో మోహరించారు.

సినిమా హాళ్లలో ఎన్నికల ఫలితాలు

మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లలో మంగళవారం ఎన్నికల ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ముంబైలోని ఎస్‌ఎం5 కల్యాణ్, సియాన్ థియేటర్లు, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్‌ థియేటర్లు, థాణేలోని ఎటర్నిటీ మాల్, వండర్‌ మాల్, నాగ్‌పూర్‌లోని మూవీమ్యాక్స్‌ ఎటర్నిటీ, పూణేలోని మూవీమ్యాక్స్‌ థియేటర్లలో ఎన్నికల ఫలితాలను లైవ్ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పేటీఎం వంటి వేదికల ద్వారా టికెట్స్ బుక్ అయ్యాయి. ఆరు గంటల పాటు ఎన్నికల ఫలితాలను ఈ థియేటర్లలో లైవ్‌ స్ట్రీమ్‌ చేయనున్నారట. ఇందుకోసం టికెట్‌ ధరలు రూ.99 నుంచి మొదలుకొని రూ.300 దాకా వసూలు చేశారట.

ఏ రాష్ట్రం.. ఎన్ని లోక్‌సభ సీట్లు ?

రాష్ట్రం లోక్‌సభ సీట్లు

తెలంగాణ 17

ఆంధ్రప్రదేశ్‌ 25

అరుణాచల్ ప్రదేశ్‌ 2

అసోం 14

బిహార్‌ 40

ఛత్తీస్‌గఢ్‌ 11

గోవా 02

గుజరాత్‌ 26

హర్యాణా 10

హిమాచల్‌ ప్రదేశ్‌ 04

జార్ఖండ్‌ 14

కర్ణాటక 28

కేరళ 20

మహారాష్ట్ర 48

మధ్యప్రదేశ్‌ 29

మణిపూర్ 02

మేఘాలయ 02

మిజోరం 01

నాగాలాండ్‌ 01

ఒడిశా 21

పంజాబ్‌ 13

రాజస్థాన్‌ 25

సిక్కిం 01

త్రిపుర 02

తమిళనాడు 39

ఉత్తర్‌ప్రదేశ్‌ 80

ఉత్తరాఖండ్‌ 05

పశ్చిమ బెంగాల్‌ 42

*************

కేంద్ర పాలిత ప్రాంతం - లోక్‌సభ సీట్లు

చండీగఢ్ 01

అండమాన్‌ నికోబార్‌ దీవులు 01

పుదుచ్చేరి 01

లక్షద్వీప్‌ 01

జమ్మూకశ్మీర్‌ 06

దాద్రానగర్‌ హవేలీ 01

దమన్‌ దీవ్‌ 01

ఢిల్లీ 07

****************************

Advertisement

Next Story