అమెరికాలో కొనసాగుతున్న నిరసనలు..ఒక్క రోజే 190 మంది అరెస్టు

by samatah |
అమెరికాలో కొనసాగుతున్న నిరసనలు..ఒక్క రోజే 190 మంది అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో జరుగుతున్న నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. దీంతో ఒక్క రోజులోనే పోలీసులు 190 మందిని అరెస్టు చేశారు. బ్లూమింగ్టన్‌లోని ఇండియానా యూనివర్సిటీలోనే 23మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్‌కు యూఎస్ సైనిక సహాయాన్ని నిలిపి వేయాలని కోరుతున్నారు. గత వారం కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనాకు అనుకూలంగా నిరసన తెలిపిన 100 మంది విద్యార్థులను అరెస్టు చేయడంతో ఈ ఆందోళనలు యూఎస్ అంతటా వ్యాపించాయి.

అయితే అమెరికా విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ నిరసనలు ఆగడం లేదు. అంతకుముందు యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించాలని కొలంబియా యూనివర్సిటీ అధ్యక్షుడు నెమట్ మినోషే షఫిక్ నిరసనకారులకు సూచించారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగడం గమనార్హం. కొలంబియా యూనివర్సిటీలోనే ఇప్పటివరకు 120 మందికి పైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో గాజాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. పలు స్వచ్చంద సంస్థలు, దేశాలు సాయం అందిస్తున్నప్పటికీ అవి ఏ మాత్రం సరిపోవడం లేదు.

Advertisement

Next Story