దేశం మోడీ పాలనను కోరుకోవడం లేదు..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

by vinod kumar |   ( Updated:2024-06-04 16:09:43.0  )
దేశం మోడీ పాలనను కోరుకోవడం లేదు..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మోడీ, అమిత్‌షాల పాలనను దేశం కోరుకోవడం లేదని తెలిపారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రియాంక, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేష్‌లతో కలిసి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘నరేంద్ర మోడీకి ఇది నైతిక పరాజయం. దేశ ప్రజలు మోడీకి వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టమైంది. బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు’ అని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థతో పాటు దేశంలోని రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.

‘భారతదేశ ప్రజలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. దేశంలోని అణగారిన వర్గాలు తమ హక్కులను కాపాడుకోవడానికి ఇండియా కూటమికి అండగా నిలిచారు. కూటమి భాగస్వాములు, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అభినందనలు’ అని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు జరిగిన పోరాటంలో ప్రజలు తమకు అండగా నిలిచారని కొనియాడారు. ప్రతిపక్షంలో ఉంటారా లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనే ప్రశ్నకు రాహుల్ స్పందిస్తూ.. బుధవారం జరిగే కూటమి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో చర్చించాకే డెసిషన్ ఉంటుందన్నారు. యూపీ ప్రజలు దేశ రాజ్యాంగానికి ఉన్న ప్రమాదాన్ని అర్థం చేసుకున్నారని అందుకే తమకు మద్దతు తెలిపారని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed