మరికొద్ది రోజులు ఢిల్లీలో వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన IMD

by Harish |
మరికొద్ది రోజులు ఢిల్లీలో వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన IMD
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)శనివారం తెలిపింది. ముఖ్యంగా ఆదివారం, సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని నగరానికి 'ఆరెంజ్' అలర్ట్ ప్రకటించింది. శనివారం ఉదయం రోహిణి, బురారి సహా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇన్ని రోజులు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌‌కు పైగా నమోదు కాగా, వర్షాలు మొదలుకావడంతో శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 'మోడరేట్' విభాగంలో ఉదయం 9 గంటలకు 108 రీడింగ్‌ నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.

ఎప్పుడెప్పుడు రుతుపవనాలు ఢిల్లీకి చేరుకుంటాయని చూస్తున్న తరుణంలో అవి శుక్రవారం నగరానికి చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం మూడు గంటలపాటు ఢిల్లీలో వర్షం దంచి కొట్టింది. నగరంలో నీళ్ల వరద రోడ్లపై పారింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయం అయ్యాయి. ముఖ్యంగా వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పు కూలిపోయింది. దీంతో విమాన కార్యకలాపాలను నిలిపేశారు. రాజధానిలోని అనేక ప్రాంతాలను కూడా వర్షం ముంచెత్తింది. శుక్రవారం 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 1936 తర్వాత జూన్‌ నెలలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed