టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐకి షాక్.. జాతీయ హోదా కోల్పోయిన 3 పార్టీలు

by Harish |
టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐకి షాక్.. జాతీయ హోదా కోల్పోయిన 3 పార్టీలు
X

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఈ మూడు పార్టీల జాతీయ హోదాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి జాతీయ హోదాను కల్పిస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, నాగాలాండ్‌లో లోక్‌ జన్‌శక్తి పార్టీ(రామ్ విలాస్), మేఘాలయలో వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీ, త్రిపురలో తిప్రా మోతా పార్టీలు రాష్ట్ర హోదా గుర్తింపు నిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈసీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆప్‌కు జాతీయ హోదా ఇవ్వడం, సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీలకు తొలగించడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్, ఉత్తరప్రదేశ్‌లో ఆర్ఎల్డీ, మణిపూర్‌లో పీడీఏ, పుదుచ్చెరీలో పీఎంకే, బెంగాల్‌లో ఆర్ఎస్పీ, మిజోరంలో ఎంపీసీ పార్టీలకు రాష్ట్ర పార్టీ హోదాలనూ రద్దు చేస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఈసీ ప్రకారం, ఒక పార్టీకి జాతీయ హోదా రావాలంటే, కనీసం నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే, ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 6శాతం ఓట్లతోపాటు కనీసం రెండు సీట్ల(లోక్‌సభ లేదా అసెంబ్లీ)లో గెలుపొందాలి.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలుపొందిన ఆప్.. దాదాపు 13 శాతం ఓట్లు సాధించింది. ఢిల్లీతోపాటు, ఈ ఏడాది గోవా, పంజాబ్, గుజరాత్‌లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు సాధించింది. దీంతో ఆప్‌‌కు జాతీయ పార్టీ హోదా లభించింది. ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ & అలాంట్‌మెంట్) ఆర్డర్, 1968లోని పారా 6 ప్రకారం ఈసీ తాజా నిర్ణయం తీసుకుంది.

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ.. తమ పార్టీ గుర్తును రిజర్వ్ చేసుకోవడం, ప్రభుత్వ టీవీ, రేడియోలో ఉచిత ప్రసార సమయం, ఎన్నికల తేదీల నిర్ణయంలో సంప్రదింపులు, పోలింగ్‌కు సంబంధించి నియమనిబంధనల రూపకల్పనలో తమ సూచనలు ఇవ్వడం వంటి అధికారాలను పొందుతుంది.


ప్రస్తుత జాతీయ పార్టీలు ఇవే..

ఎన్సీపీ, సీపీఐ, టీఎంసీలకు జాతీయ పార్టీ హోదాను రద్దు చేయడంలో దేశంలోని మొత్తం జాతీయ పార్టీ సంఖ్య 6 కు చేరింది. ఇందులో కొత్తగా చేరిన ఆప్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ), సీపీఎం, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed