Syria: తిరుగుబాటుదారుల చేతుల్లోకి మరో నగరం.. సిరియాలో సైన్యానికి షాక్

by vinod kumar |
Syria: తిరుగుబాటుదారుల చేతుల్లోకి మరో నగరం.. సిరియాలో సైన్యానికి షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: సిరియా(Syria)లో కొనసాగుతున్న ఘర్షణలో సైన్యానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో నాలుగో అతిపెద్ద నగరమైన హమా(Hama)ను తిరుగుబాటు దారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని సిరియా సైన్యం(Syria Army) ధ్రువీకరించింది. హమాపై పట్టుసాధించేందుకు మిలిటెంట్లు గత 3 రోజులుగా సైన్యంతో పోరాడుతున్నారు. ఇరు వర్గాల మధ్య భీకర యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలోనే గురువారం హస్తగతం చేసుకున్నారు. అయితే తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారని సైన్యం ఆరోపించింది. ఈ ప్రాంతంలో పౌరుల ప్రాణాలను కాపాడటానికి భారీగా బలగాలను మోహరిస్తామని తెలిపింది. హమా అనంతరం రాజధాని డమాస్కస్‌(Damaskas)ను కలిపే కీలక కూడలి నగరమైన హోమ్స్ వైపు దూసుకెళ్తామని రెబల్స్ ప్రకటించారు. తమకు సహకరించాలని హోమ్స్ ప్రజలకు పిలుపునిచ్చారు.

కాగా, సిరియాలో హమా నాలుగో అతిపెద్ద నగరం. 2011లో ప్రారంభమైన అంతర్యుద్ధంలోనూ హమాను స్వాధీనం చేసుకోలేకపోయారు. అప్పుడు కూడా ఈ నగరం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పట్టుబడడం తిరుగుబాటుదారులకు పెద్ద విజయంగా చెప్పొచ్చు. మరోవైపు రష్యా సైన్యం కూడా సిరియా సైన్యానికి అనుకూలంగా వైమానిక దాడులు చేసింది. కానీ రెండు సైన్యాలు కలిసినా తిరుగుబాటుదారులను ముందుకు వెళ్లకుండా ఆపలేకపోవడం గమనార్హం. అంతకుముందు డిసెంబర్ 1న రెండో అతిపెద్ద నగరమైన అలెప్పోను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed