Supreme court: వితంతువుపై వ్యాజ్యం.. కేంద్రానికి సుప్రీంకోర్టు రూ.50,000 ఫైన్

by vinod kumar |
Supreme court: వితంతువుపై వ్యాజ్యం.. కేంద్రానికి సుప్రీంకోర్టు రూ.50,000 ఫైన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఓ సైనికుడి వితంతువును అనవసర వ్యాజ్యంలోకి నెట్టినందుకు గాను కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme court) ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక రూ.50000 జరిమానా విధించింది. భర్త మరణించిన తర్వాత ఆమెకు సరళీకృత పెన్షన్ మంజూరు చేసిన ట్రిబ్యునల్ నిర్ణయానికి వ్యతిరేకంగా వారు చేసిన అప్పీల్‌ను తోసిపుచ్చింది. వితంతువును కోర్టుకు లాగి ఉండకూడదని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మరణించిన సైనికుడి భార్య పట్ల సానుభూతితో ఉండాల్సిందని అభిప్రాయపడింది. కాబట్టి ప్రతివాదికి రూ. 50,000 జరిమానా విధిస్తున్నామని తెలిపింది. ఈ ఫైన్‌ను రెండు నెలల్లోగా వితంతువుకు చెల్లించాలని ఆదేశించింది.

2013లో నాయక్ ఇంద్రజిత్ సింగ్ (Indrajith singh) అనే సైనికుడు సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గుండోపోటుతో మరణించారు. అతని మరణం సైనిక సేవ కారణంగా భౌతిక ప్రమాదంగా వర్గీకరించారు. ఈ క్రమంలో నాయక్ భార్యకు ప్రత్యేక కుటుంబ పెన్షన్‌తో సహా అన్ని ఇతర ప్రయోజనాలు అందించారు. కానీ లిబరలైజ్డ్ ఫ్యామిలీ పెన్షన్ (LFP)ని నిరాకరించారు. దీంతో ఆమె సాయుధ దళాల ట్రిబ్యునల్‌ (AFT)లో పిటిషన్ వేసింది. దరఖాస్తును పరిశీలించిన ట్రిబ్యునల్ సైనికుడి మరణం 2003 ఆర్మీ ఆర్డర్ 1 ప్రకారం యుద్ధంలో మరణించినవారి కిందకే వస్తుందని నిర్ధారించింది. సైనికుడి భార్యకు ఎల్ఎఫ్‌పీ మంజూరు చేసి మరణించిన సైనికుల విషయంలో చెల్లించాల్సిన ఎక్స్-గ్రేషియా మొత్తాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, సైన్యం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాయి. దీనిపై తాజాగా ధర్మాసనం విచారణ చేపట్టింది. వారి పిటిషన్‌ను తోసిపుచ్చింది. నియంత్రణ రేఖకు సమీపంలో కార్యాచరణ విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనే ఇంద్రజిత్ సింగ్ మరణించించారని తెలిపింది. వితంతువుకు మూడు నెలల్లో సరళీకృత పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశించింది. ఇలాంటి కేసులో వితంతువును కోర్టుకు లాగి ఉండాల్సింది కాదని తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

Next Story