అంతరిక్షమూ యుద్ధక్షేత్రమే..

by S Gopi |
అంతరిక్షమూ యుద్ధక్షేత్రమే..
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతరిక్షం కూడా యుద్ధాలకు వేదికగా మారిందని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. గగనతలం, సముద్రం, భూభాగాలపై ప్రభావం ఉంటుందన్నారు. గురువారం ఢిల్లీలో మూడు రోజుల ఇండియన్ డిఫెన్స్ స్పేస్ సింపోజియం ప్రారంభ సెషన్‌లో ప్రసంగం చేసిన ఆయన పలు కీలక అంశాలు ప్రస్తావించారు. అంతరిక్ష దౌత్యం త్వరలో వాస్తవ రూపంలోకి మారనుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో అంతరిక్షం పాత్ర గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. 'అంతరిక్షం మనకున్న చివరి సరిహద్దు. దాని విస్తీర్ణం అనంతం. విస్తరిస్తూనే ఉంది. ఇతర సరిహద్దుల తరహాలో దాన్ని అంచులను నిర్వచించడం కష్టం. అంతరిక్షం రహస్యాలను కనుగొనేందుకు మానవజాతి ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ ప్రయాణంలో భారత్ సైతం భాగమవ్వాలని ఆశిస్తోంది. భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు అంతరిక్షాన్ని ఓ వేదికగా పరిగణిస్తారు. ఇప్పటికే అది మొదలైందని, దాని ప్రభావం గగనతలం, సముద్రం, భూభాగంపై కూడా ఉంటుందని' వెల్లడించారు. అంతరిక్షాన్ని 'గ్లోబల్ కామన్స్'గా పేర్కొంటూ, అక్కడ సార్వభౌమాధికారం ఉండదని అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. మిత్ర దేశాలకు సహకారం అందించేందుకు పొరుగు దేశంగా ఉండాల్సిన పనిలేదు. అంతరిక్ష రంగంలో ఇప్పటివరకు భారత్ ఇతర దేశాల నుంచి సేవలను పొందింది. రానున్న రోజుల్లో ఇతర దేశాలకు సేవలందించగలదన్నారు.

Advertisement

Next Story

Most Viewed