Emergency Martial Law: దక్షిణ కొరియాలో సైనిక పాలన.. ఇందిరా గాంధీ తరహా ఎమర్జెన్సీ!

by Mahesh Kanagandla |
Emergency Martial Law: దక్షిణ కొరియాలో సైనిక పాలన.. ఇందిరా గాంధీ తరహా ఎమర్జెన్సీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి పేరున్న, అమెరికా మిత్రదేశం దక్షిణ కొరియా(South Korea)లో రాజకీయ సంక్షోభం(Political Crisis) నెలకొంది. ఆ దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం అర్ధరాత్రి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఎమర్జెన్సీ మార్షల్ లా(Emergency Martial Law)ను ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పార్లమెంటులో ప్రతిపక్షం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది. అధ్యక్షుడు యూన్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా లేరు. దీంతో అక్కడ మన దేశంలో ఇందిరా గాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ తరహా పరిస్థితులే నెలకొనబోతున్నాయి. రాజకీయ కార్యకలాపాలు, సభ నిర్వహించడం, సమావేశమవడం(పార్లమెంటు, కౌన్సిళ్లూ), నిరసనలు, ఆందోళనలపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఇది వరకే ఆందోళనలు చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లోకి రావాలని సైనిక కమాండర్ ఆదేశించారు. మీడియా పూర్తిగా సైన్యం పర్యవేక్షణ కిందకు వస్తుందని స్పష్టం చేశారు. ప్రకటించిన నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు, వారంట్ జారీ లేకుండా అదుపులోకి తీసుకోవచ్చని, నిర్బంధాలూ ఉంటాయని వార్నింగ్ ఇవ్వడం త్వరలో ఆ దేశంలో నెలకొనే అప్రజాస్వామిక పరిస్థితులను వెల్లడిస్తున్నాయి.

అధ్యక్షుడు ఏమన్నారు?

అధ్యక్షుడు యూన్ మాట్లాడుతూ.. ఈ సైనిక పాలన ద్వారానే తాను స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక దేశాన్ని నిర్మిస్తానని, రాజ్యాంగ ప్రజాస్వామిక పాలనను కాపాడుతానని తెలిపారు. ఉత్తర కొరియా దళాలు, వారికి సానుభూతిగానున్న దేశద్రోహ శక్తుల ముప్పు నుంచి స్వతంత్ర దక్షిణ కొరియా దేశాన్ని కాపాడుకోవడానికే ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశ స్వతంత్ర, భద్రత కోసం, దేశద్రోహ శక్తుల కుట్రల నుంచి కాపాడి దేశాన్ని సుస్థిరత వైపు నడిపించడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వివరించారు. జాతి అవసరానికి, డ్రగ్స్, నేరాలకు చెక్ పెట్టడానికి, ప్రజా భద్రతకు, ముఖ్యమైన పనులకు పార్లమెంటు బడ్జెట్ కేటాయింపులు చాలా వరకు తగ్గిపోయాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఫలితంగా దేశంలో అరాచకం నెలకొందని, ప్రజలకు సురక్షణ లేని, మాదకద్రవ్యాలకు స్వర్గధామంగా దేశం మారుతున్నదని పేర్కొన్నారు. ఈ ఎమర్జెన్సీ ఎప్పటి వరకు అమల్లో ఉంటుందనే విషయాన్ని ఆయన తెలుపలేదు.

పార్లమెంటులో మైనార్టీ

దక్షిణ కొరియాలో అధ్యక్షుడిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అనే ప్లూరాలిటీ విధానంలో ఎన్నుకుంటారు. అంటే ఈ సింగిల్ ఓట్లు(ప్రాధాన్యత ఓట్లు కాదు) ఎవరికి ఎక్కువ వస్తే వారే గెలిచినట్టు. అంటే దేశంలోని మొత్తం ఓట్లల్లో 50 శాతం ఓట్లు దక్కకున్నా అధ్యక్షుడిగా గెలిచే చాన్స్(ఎక్కువ మంది బరిలో ఉంటే.. సాధారణంగా ఉంటారు) ఉంటుంది. ప్రస్తుత అధ్యక్షుడు యూన్ పీపుల్ పవర్ పార్టీ నాయకుడు. ఈయన పార్టీకి పార్లమెంటులో మెజార్టీ లేదు. గతంలో అధికారంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీకి మెజార్టీ ఉన్నది. ఫలితంగా పార్లమెంటులో అధ్యక్షుడి ఎజెండా ముందుకు సాగడం లేదు. 2022లో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి యూన్ పార్లమెంటులో ఎదురీదుతున్నారు. తన నిర్ణయాలకు ఆమోదం కోసం పట్టుపడుతున్నారు. తన భార్య, ఉన్నతాధికారుల స్కాములతో రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్ విషయమై పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు యూన్ అత్యవసర సైనిక పాలనను ప్రకటించారు. వెంటనే చట్టసభ్యులు పార్లమెంటుకు చేరుకోగా.. సైనికులు వారిని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. ప్రజలూ పార్లమెంటు వద్దకు వచ్చి ఆందోళనలు చేశారు. యూన్ సొంత పార్టీ నేతలు కూడా ఈ నిర్ణయాన్ని నిరసించారు. సైనిక పాలన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 300 మంది చట్టసభ్యుల్లో 190 మంది పార్లమెంటులో ఓట్లు వేశారు. అక్కడి చట్టాల ప్రకారం మెజార్టీ నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ తీర్మానాన్ని అధ్యక్షుడు పక్కనపెడితే న్యాయవ్యవస్థ ఏమేరకు ఇందులో జోక్యం చేసుకుంటుందనే అంశం త్వరలో తేలనుంది.

చివరి సారి

చరిత్రలో దక్షిణ కొరియా నియంతపాలనలో పలుమార్లు ఉన్నది. 1980ల తర్వాత ఈ దేశాన్ని ప్రజాస్వామిక దేశంగా భావిస్తున్నారు. 1980ల తర్వాత తొలిసారిగా ఇప్పుడే సైనిక పాలన అమల్లోకి వచ్చింది. కొరియా యుద్ధం తర్వాత రెండుగా విడిపోయిన ఈ దేశాలు ఉత్తర కొరియా అప్పటి సోవియట్ రష్యా వైపు, దక్షిణ కొరియా అమెరికా వైపు నిలబడ్డాయి. వాస్తవానికి అమెరికా, సోవియట్ రష్యాల ప్రచ్ఛన్న యుద్ధమే కొరియాను నిలువునా చీల్చిందనే చర్చ ఉన్నది. ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఉన్నది. కానీ, ఉత్తర కొరియా నుంచి రక్షణగా సుమారు 28 వేల అమెరికా ట్రూపులు దక్షిణ కొరియాలో ఉన్నాయి. అక్కడి పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నట్టు యూఎస్ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed