Pushpa 2 : ఏపీలో పుష్ప 2పోస్టర్ల చించివేత..కటౌట్లతో వైసీపీ వేడుకలు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-04 10:22:26.0  )
Pushpa 2 : ఏపీలో పుష్ప 2పోస్టర్ల చించివేత..కటౌట్లతో వైసీపీ వేడుకలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(AP) రాజకీయాల్లో పుష్ప 2(Pushpa 2) సినిమా సెగలు రేపుతోంది. మెగా ఫ్యామిలీని బన్నీ చిన్నచూపు చూశారంటూ జనసేన (Janasena)నేతలు పుష్ప 2 సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో 'పుష్ప 2' పోస్టర్లు చించివేయడం కలకలం రేపింది. రేపు 'పుష్ప 2' సినిమా రిలీజ్ కానుండగా ఇంతలోనే అల్లు అర్జున్ మేనమామ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీల మధ్య దూరం మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. పుష్ప 2 పోస్టర్లు చించిందెవరన్న దానిపై బన్నీ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. జనసేన కార్యకర్తలే ఆ పని చేసినట్లయితే వివాదం మరింత ముదరనుంది.

మరోవైపు పుష్ప 2 సినిమాకు మాజీ సీఎం జగన్ అభిమానులు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కటౌట్లు..హోర్డింగ్స్ తో సంబరాలు చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఏర్పాటు చేసిన పుష్ప2 ఫ్లెక్సీలో మాజీ సిఎం జగన్, అల్లు అర్జున్ ఫోటోలు పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మా కోసం నీవు వచ్చావు..మీ కోసం మేము వస్తాం..తగ్గేదే లే అంటూ ఈ ఫ్లెక్సీలో క్యాప్షన్ పెట్టడం చర్చనీయాంశమైంది. ఒకవైపు అధికార టీడీపీ కూటమిలో భాగమైన జనసేన పార్టీ నేతలు పుష్పా 2ను అడ్డుకుంటామంటుంటే ఇంకోవైపు ప్రతిపక్ష వైసీపీ పార్టీ శ్రేణులు పుష్పా 2కు మద్ధతుగా సంబరాలు చేసుకుంటుండం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ ఏపీ ఎన్నికల్లో నంద్యాలలో తన బంధువైన వైసీపీ అభ్యర్థి శిల్పారవిరెడ్డి గెలుపు కోరుతూ సతీసమేతంగా ప్రచారం నిర్వహించినప్పటి నుంచి జనసేన శ్రేణులు బన్నీకి వ్యతిరేకంగా మారిపోయాయి. తాజాగా హైదరాబాద్ లో జరిగిన పుష్ప 2 సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ప్రస్తావన చేయకపోవడంతో జనసేన నేతలు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మరింత మండిపడుతున్నారు.




Advertisement

Next Story