నజ్రుల్‌ కవిత్వానికి వారసులు ఎవరైనా ఉన్నారంటే అది వరవరరావు గారే!

by Jakkula Mamatha |   ( Updated:2024-12-04 13:04:39.0  )
నజ్రుల్‌ కవిత్వానికి వారసులు ఎవరైనా ఉన్నారంటే అది వరవరరావు గారే!
X

సైనిక బలగాలు ఎక్కుపెట్టిన తుపాకులు, బుల్లెట్ల గురికి ఒరిగిపోతున్న తాజా జీవితాలు, అయినా గానం సాగుతోంది `

‘‘బంధిఖానా ఇనుప ద్వారాలు

బద్దలు కొట్టండి

సంకెళ్లను పూజించే

రక్తసిక్త మందిరాల

బలిపీఠాలను ధ్వంసం చేయండి’’ అంటూ.

మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లోని ఈ దృశ్యాన్ని చూసి చలించని వారు లేరు. కవితలూ, పాటలతో తుపాకీ గొట్టాన్ని ఓడించే ఈ దృశ్యం ప్రతిఘటననూ, విప్లవాన్నీ విశ్వసించే ప్రతి వ్యక్తికీ ధైర్యాన్నిచ్చింది. ఈ ప్రతిఘటన స్పర్శ నా మదినీ తాకింది. యాదృచ్ఛికంగా, బంగ్లాదేశ్‌లో రెండవ స్వాతంత్య్ర సమరంగా పిలవబడిన ఈ ఉద్యమ సమయంలోనే నేను మా ఐదవ తరగతి గదిలో నజ్రుల్‌ ఇస్లాం గురించి ఒక వ్యాసాన్ని ప్రారంభించాను. ‘‘మీ అందరికీ కాజీ నజ్రుల్‌ ఇస్లాం తెలుసా?’’ మా పిల్లలకు నేనడిగిన మొదటి ప్రశ్న. అందరి నుండీ మౌనమే సమాధానం. అటు వైపు బంగ్లాలో నిరాయుధ బెంగాలీలు నజ్రుల్‌ ఇస్లాం పాటలూ, కవితలనే కవచంగా ధరించి తుపాకీ గొట్టానికి ఎదురుగా నిలబడితే, ఇటు వైపు బంగ్లాలో విస్మృతి చీకట్లో మరుగున పడుతున్నాడు మన ‘విద్రోహి కవి’. తరగతి ముగిశాక ఉపాధ్యాయుల గదికి వచ్చి ఒక సహ ఉపాధ్యాయుడికి జరిగింది చెప్పాను. ‘నజ్రులా, ఆయన బంగ్లాదేశ్‌కి చెందిన వాడు కదా?’ ఆయన సమాధానం. విస్మృతి గంభీరత ఎంతో అర్థమైంది.

మన ప్రియతమ కవి, కామ్రేడ్‌ వరవరరావు గారు నజ్రుల్‌ ఇస్లాం కవిత్వాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారనీ, అది పుస్తక రూపంలో రాబోతోందనీ తెలిసిన వెంటనే నాకేమనిపించిందంటే, ఈ రోజు నజ్రుల్‌ కవిత్వానికి వారసులు ఎవరైనా ఉన్నారంటే అది వరవరరావు గారే కదాని.

జీవితంలో ఎక్కువ భాగం జైలులోనే గడిపిన వివి, నజ్రుల్‌ని అనువదిస్తున్నారు. ఒక విప్లవకారుడు మరో విప్లవకారుడి మాటలను స్పృశిస్తున్నాడు! భాష వేరైనా, స్వప్నం ఒకటే - విముక్తి స్వప్నం, స్వేచ్ఛా స్వాతంత్య్రాల స్వప్నం దేశాలూ, సరిహద్దుల ముళ్ళ కంచెల్ని లెక్కజేస్తుందా? అందుకే విముక్తి పోరాటంలో స్వేచ్ఛా నినాదాలయ్యారు ఫైజ్‌ నుండి నెరూడా వరకూ కవులంతా.

ఒకవైపు మెజారిటీ ఉగ్ర హిందుత్వ ఫాసిజం, మరోవైపు మైనారిటీల్లో పెరుగుతున్న మత ఛాందసవాదం - ఈ రెండింటి మధ్య నజ్రుల్‌ ఇస్లాం, అతని పోరాట, ప్రతిఘటనల స్వప్నాలు బెంగాలీల స్మృతిపథంలోంచి కనుమరుగవుతున్నాయి. వరవరరావు అనువదించిన ‘విద్రోహి’ కవితా సంపుటిలో మొత్తం 64 కవితలున్నాయి. కవి, కామ్రేడ్‌ వరవరరావు గారు తన కవితా సంపుటానికి ‘ముందుమాట’ రాయమన్నపుడు నేను తీవ్ర సంశయంలో పడ్డాను ` నాకంతటి అర్హత వుందా అని అనుమానమొచ్చింది. కానీ స్వేచ్ఛ కోసం, విముక్తి కోసం నజ్రుల్‌ ` వివి సాగించిన పోరు గాలి నాలో ధైర్యాన్ని నింపింది.

తొంభైలలో కూడా నజ్రుల్‌ ఇస్లాం గురించి మా సమాజాల్లో మాట్లాడుకునేవారు, అతని పేర ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. కానీ ఒక వైపు పెట్టుబడిదారీ మార్కెట్‌ తాళాలూ, మరో వైపు రామజన్మభూమి ఉద్యమ తాళాలూ తెరుచుకోవడంతో సమీకరణాలన్నీ మారిపోయాయి. ఆ తర్వాత కుల, మతాలకతీతంగా పీర్‌ దర్గాల్లో అందరినీ సమాదరించే ముస్లింల సమాజంలో జమాత్‌ ఆవిర్భవించింది. నజ్రుల్‌ గీతాల పఠనాల స్థానంలో బహిరంగ మైదానాల్ని మతపరమైన ర్యాలీలు ఆక్రమించాయి. హిజాబ్‌ అనే మాట విరివిగా వ్యాప్తిలోకి వచ్చింది. గడ్డం-టోపీ కనిపిస్తే ‘అదిగో లాడెన్‌’ అనే వ్యంగ్యోక్తులు! అప్పటికే 9/11 సంభవించింది!

కవిని ఒక ఇంటికీ, ఒక దేశానికీ పరిమితం చేయవచ్చా? ‘కారార్‌ ఓయ్‌ లౌహొ కొపొట్‌’ (ఆ బంధిఖానా ఇనుప ద్వారాలు) అన్న పాటతో నవంబరు 23న హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో నజ్రుల్‌ ఇస్లాం కవితా సంపుటి ఆవిష్కరణ సభ మొదలైనపుడు - కవిని ఒక దేశానికి పరిమితం చేయలేమని మరోసారి రుజువైంది. అక్షరాల భాషకు మించినది ప్రతిఘటన భాష!

నజ్రుల్‌ ఇస్లాం ` వరవరరావు - ఇద్దరూ తమ తమ కాలాల్లో ఓటమినంగీకరించని స్వాప్నికులు. నజ్రుల్‌ ‘విద్రోహి’ అనే కవితలో ఇలా అంటారు.

‘‘నేను అదుపు చేయలేనివాణ్ని, అణచివేయలేనివాణ్ని.

నా జీవన పాత్ర ఎప్పుడూ, అవును ఎల్లప్పుడూ

అంచుల దాకా నిండి ఉంటుంది.

నేను హోమ శిఖని, యజ్ఞాగ్నిని, జమదగ్నిని

యజ్ఞాన్ని నిర్వహించే అర్హత ఉన్న పూజారిని,

నేనే అగ్నిని.

నేనే సృష్టిని, నేనే విధ్వంసాన్ని

నేనే మానవ ఆవాసాన్నీ, నేనే శ్మశాన వాటికనీ.

చేతిలో చంద్రుడ్నీ, నుదిటిపై సూర్యుడ్నీ

ధరించిన ఇంద్రాణి కొడుకుని.

ఒక చేత వెదురు వేణువునూ, మరో చేత రణ భేరినీ కలిగున్నవాణ్ని.

నేను నీలకంఠుణ్ని, సాగర మథనంలో పుట్టిన

విషాన్నీ, బాధనూ భరించినవాణ్ని.

నేను వ్యోమకేశుణ్ని, శిరోజాల్లో గంగోత్రి జలధారను మోస్తున్నవాణ్ని.

వీరుడా, ఎలుగెత్తి చాటు.

నీ శిరస్సెపుడూ ఉన్నతంగా వుంటుందని చాటు.’’

అదే ఒరవడిలో తనదీ అదే స్వప్నం అని వరవరరావు వివరిస్తారు తన ‘ఇప్పుడు సంకెళ్లు రాస్తున్నాయి’ కవితలో.

‘‘బయట నువ్వెంత ఒంటరివో

నీ నీడ కూడా నీకు నిజం చెప్పలేక

ఇచ్చకాలే చెప్తున్నదో

లోపల నేనెంత బలగంలో ఉన్నాను

సిద్ధాంత బలంతో ఉన్నాను

ఇవాళ మౌనంగా ఉన్నా

ఇపుడో రేపో లావాలెగజిమ్మే

అగ్ని సదృశ ప్రజాబలంతో ఉన్నాను

దీర్ఘ నిశ్శబ్ద నిర్బంధంలో

ఆలోచనల్ని పదును పెడుతూ

ఇపుడు నిగళాలు రాస్తున్నాయి నియంతా,

రేపు గళం విప్పి స్వేచ్ఛలో పాడుతాను’’ అంటాడు.

ఒకే స్వేచ్ఛ కోసం, విప్లవం కోసం స్వప్నించే ఇద్దరు దార్శనికులు ఒకేచోట కలుస్తారు వరవరరావు గారు తెలుగులో అనువదించిన ‘విద్రోహి’ కవితా సంపుటిలో. జైల్లో తన వద్ద నజ్రుల్‌ ఇస్లాం కవిత్వం తోడుగా ఉండేదని వరవరరావు అంటారు. అన్యభాషా కవిని మన ప్రియ కవి పదే పదే గుర్తు చేసుకుంటున్నారంటే విప్లవం అనే మాటను ఆయన ఎంతగా మననం చేస్తుంటారో!

తను పుట్టిన పశ్చిమ బెంగాల్‌లోనే నజ్రుల్‌ పరాయి వాడయ్యాడు. కొందరికి నజ్రుల్‌ అధ్యయనమంటే పరిశోధనా పత్రాల్లో బంధించేయడమే. 1972లో పశ్చిమ బెంగాల్‌ను విడిచి వెళ్లారు నజ్రుల్‌. ఇప్పుడాయన ప్రాసంగికత పెద్దగా లేదంటారు కొందరు పండితులు. నిజానికి నక్సల్బరీకి జన్మనిచ్చిన నేల బిడ్డలు తలలు తాకట్టు పెట్టి, సగం బెంగాలీ, సగం హిందీ కలగలిసిన భాషలో తక్కువ ప్రమాదకర భూతాలు, ఎక్కువ ప్రమాదకర భూతాల మధ్య వ్యత్యాసాలు కనిపెడుతూ బ్యాలెట్‌ బాక్స్‌లో విప్లవం వెదుక్కుంటున్నారు. ఇలాంటి సమాజంలో నజ్రుల్‌ గురించి ఇలాంటి వ్యాఖ్యలు వినిపించడం మామూలే. నజ్రుల్‌ కవిత్వంలో శిల్పనైపుణ్యం లోపించిందంటాడు ఓ పండితుడు.

వాస్తవానికి ఇదో చిరకాల సమస్యే. నిరసన కవిత్వాన్ని నినాదాల కవిత్వంగా ముద్రవేసి ప్రధాన స్రవంతి నుండి వేరుచేసే మరుగుజ్జు ప్రయత్నమిది.

నేడు దేశాన్ని కేవలం 10 మంది శతకోటీశ్వరులకు అమ్మేస్తూ ఢిల్లీని గ్యాస్‌ ఛాంబర్‌గా మార్చేశాక, మార్కెట్‌ మన జల్‌, జమీన్‌, జంగల్‌లను కబళిస్తోంది. ఎన్నో కష్టాలుపడి సంపాదించిన ఎనిమిది గంటల పని దినం సంగతి మరిచిపోయి గిగ్‌ వర్కర్లు పెట్టుబడిదారీ మార్కెట్‌ బానిసలుగా మారిపోయారు. ఇది చూస్తూ కూడా ప్రైవేటీకరణ జరిగితే ప్రజా ప్రయోజనాలు మెరుగౌతాయని మనలోని కొందరు కిళ్లీ నముల్తూ సెలవిస్తారు. ఇటువంటి సమయంలో నజ్రుల్‌ ఇస్లాం, వరవరరావుల అవసరం మరింత పెరుగుతుంది.

నజ్రుల్‌ కవిత్వాన్ని వరవరరావు గారు అనువదించగా తయారైన ఈ ‘విద్రోహి’ కవితా సంపుటి తెలుగు మాట్లాడే విద్యార్థులకూ, యువతకూ, విప్లవ పథంలో మొండిగా సాగిపోతున్న ప్రజలకూ తప్పకుండా స్వప్నాన్నీ, ధైర్యాన్నీ ఇస్తుంది. ఇక నైపుణ్యం, శిల్ప సౌందర్యం గురించి గొణుక్కునే బెంగాలీలు మరో విప్లవ కవి సరోజ్‌ దత్త్‌ రాసిన ఈ మాటల్ని గమనించవచ్చు.

‘‘కవిత్వం నినాదమై పోయిందని మీ బాధ

నినాదమే కవిత్వం కానందుకు మీకు బాధ లేదెందుకో

అన్నదే నా బాధ.’’

మూలం: మౌమితా ఆలం:7076773062

బెంగాలీ నుండి అనువాదం: బాలాజీ (కోల్‌కతా):90077 55403

Advertisement

Next Story