Special Trains : పండుగల సీజన్ వేళ 7వేల స్పెషల్ ట్రైన్స్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1400 ప్రత్యేక రైళ్లు

by Hajipasha |
Special Trains : పండుగల సీజన్ వేళ 7వేల స్పెషల్ ట్రైన్స్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1400 ప్రత్యేక రైళ్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : దీపావళి, ఛత్ పూజల సందర్భంగా దేశవ్యాప్తంగా రైళ్లలో రద్దీ పెరగనుంది. ఈనేపథ్యంలో రైల్వే శాఖ 7వేల స్పెషల్ ట్రైన్స్‌ను నడపనుంది. వీటిలో 1400 స్పెషల్ ట్రైన్స్‌ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో, 3,050 స్పెషల్ ట్రైన్స్‌ను నార్తెర్న్ రైల్వే పరిధిలో నడపనున్నారు. వీటి ద్వారా అదనంగా 2 లక్షల మందికి రైళ్లలో ప్రయాణించే వసతి కలగనుంది. గురువారం విలేకరుల సమావేశంలో ఈవివరాలను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తెలంగాణ, ఏపీ, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల ప్రజలకు ఈ స్పెషల్ ట్రైన్స్ వల్ల ప్రయాణ సౌకర్యం కలుగుతుందన్నారు. గతేడాది కంటే ఈసారి ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచామని ఆయన పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తిరుపతి, నిజాముద్దీన్, విశాఖపట్నం, గోరఖ్‌పూర్, అగర్తలా, రక్సౌల్, నాగర్‌సోల్, దానాపూర్, సంత్రాగచి, శ్రీకాకుళం వంటి స్టేషన్లు ఉండే రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

నవంబరు 16 నుంచి ‘భారత్ గౌరవ్’ రైలు : ఐఆర్‌సీటీసీ

శబరిమల యాత్ర కోసం ప్రత్యేక థీమ్‌తో ‘భారత్ గౌరవ్’ రైలును నడుపుతామని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. ఈ రైలును నవంబరు 16న సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో ప్రారంభిస్తామని తెలిపింది. శబరిమల అయ్యప్ప దేవాలయం, ఛొట్టనిక్కారా దేవి ఆలయాల దర్శనానికి వెళ్లేవారికి ఈ రైలు ప్రత్యేకం. తెలంగాణ, ఏపీ పరిధిలోని 10 రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. హాల్టింగ్ స్టేషన్ల జాబితాలో.. నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు ఉన్నాయి. మొత్తం నాలుగు రాత్రులు, ఐదు రోజుల పాటు ఈ రైలు ట్రిప్ ఉంటుంది. రైలులో వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. ఈ రైలులో స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.11,475, థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.18,790, సెకండ్ ఏసీ టికెట్ ధర రూ.24,215.

Advertisement

Next Story