సొరేన్ అరెస్ట్ ఆదివాసీ వ్యతిరేక చర్య: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్

by samatah |   ( Updated:2024-02-01 06:20:41.0  )
సొరేన్ అరెస్ట్ ఆదివాసీ వ్యతిరేక చర్య: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భూకుంభకోణం కేసులో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్ హేమంత్ సొరేన్‌ను ఈడీ అరెస్టు చేయడంపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. సొరేన్ అరెస్టును ఆదివాసీ వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. బీజేపీ అప్రజాస్వామిక పద్దతులను అవలంభిస్తోందని విమర్శించారు. జార్ఖండ్ ఎప్పటికీ తలవంచబోదని తెలిపారు. జార్ఖండ్‌లో గిరిజన హక్కులను పరిరక్షించేందుకు సొరేన్ ఎంతో కృషి చేశాడని కొనియాడారు. అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. హేమంత్‌ను అరెస్టు చేసిన తీరు రాష్ట్ర ప్రజలను అవమానించిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బ్యాలెట్ బాక్సు వద్ద తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తోందని మండిపడ్డారు. నైతికంగా 2024 ఎన్నికలలో బీజేపీ ఇప్పటికే ఓడిపోయిందని దుయ్యబట్టారు.

సుప్రీంకోర్టులో పిటిషన్‌

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసిన విషయాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు ఎదుట ప్రస్తావించారు. ఈ అంశాన్ని శుక్రవారం జాబితా చేయడానికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. మరోవైపు, తన అరెస్టుపై హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు సైతం రేపు విచారించనుంది. హేమంత్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ సచిన్‌ కుమార్‌ అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దీనిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఎలాంటి ఎమర్జెన్సీ కనిపించడం లేదని తెలిపింది. ఫిబ్రవరి 2న విచారణ జరుపుతామని వెల్లడించింది.

Advertisement

Next Story