Ajit Pawar: కుటుంబాల్లో చీలికలను సమాజం ఇష్టపడదు

by Shamantha N |
Ajit Pawar: కుటుంబాల్లో చీలికలను సమాజం ఇష్టపడదు
X

దిశ, నేషనల్ బ్యూరో: కుటుంబాల్లో చీలికలను సమాజం ఇష్టపడదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. ఈ పరిస్థితిని తాను అనుభవించానని.. ఇప్పటికే తన తప్పుని అంగీకరించాని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఎన్సీపీ నిర్వహించిన జనసమ్మన్ ర్యాలీలో అజిత్ పవార్ ప్రసంగించారు. మహారాష్ట్ర మంత్రి ధర్మారావు బాబా ఆత్రం కుమార్తె భాగ్యశ్రీని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ) లోకి వెళ్లొద్దని సూచించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలలో అజిత్ పవార్ భార్య సునేత్ర, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే మధ్య పోటీ గురించి ప్రస్తావించారు. సోదరిపై భార్యను పోటీకి దింపి తప్పుచేశానని మరోసారి అంగీకరించారు.

తండ్రీకూతుర్ల మధ్య పోటీ

ఇకపోతే, త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగ్యశ్రీ, ఆమె తండ్రి ఆత్రం మధ్య పోటీ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపైనే డిప్యూటీ సీఎం అజిత్ స్పందించారు. ”కూతురిని తన తండ్రి కంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించరు. ఆమెకు పెళ్లిచేసి బెల్గాం ప్రాంతానికి పంపినప్పటికీ.. గడ్చిరోలిలో ఆమెకు ఆత్రం అండగా నిలిచి జిల్లా పరిషత్ అధ్యక్షురాలిని చేశారు. ఇప్పుడు మీరు (భాగ్యశ్రీ) తండ్రిపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఇది సరైనదేనా?" అని ఆయన భాగ్యశ్రీని ప్రశ్నించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సత్తా, దృఢ సంకల్పం మీ తండ్రికి మాత్రమే ఉందని ఆమెకు హితవు పలికారు. సొంత కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడాన్ని సమాజం ఎప్పుడూ అంగీకరించదని ఆయన అన్నారు. "ఇది సమాజానికి ఇష్టం లేదు. నేను అదే అనుభవించాను. నా తప్పుని అంగీకరించానని" చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed