సిక్కింలో ఎస్‌కేఎం జోరు..అరుణాచల్‌లో బీజేపీ హవా: కొనసాగుతున్న కౌంటింగ్

by vinod kumar |
సిక్కింలో ఎస్‌కేఎం జోరు..అరుణాచల్‌లో బీజేపీ హవా: కొనసాగుతున్న కౌంటింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) జోరు కొనసాగిస్తుండగా..అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ విజయం దిశగా దూసుకు పోతోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా..10 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 50 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ 17 స్థానాల్లో విజయం సాధించగా..మరో 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. గతంలో ఏకగ్రీవమైన 10 స్థానాలతో కలిపి బీజేపీ 27 సీట్లలో గెలుపొందింది. నేషనల్ పీపుల్స్ పార్టీ రెండు సెగ్మెంట్‌లలో విజయం సాధించగా..మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) 3 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అలాగే ఇండిపెండెంట్లు ఒక స్థానంలో గెలుపొందగా..మరొక స్థానంలో లీడ్‌లో ఉన్నారు. బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.

ఇక, సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు గాను ఎస్‌కేఎం ఇప్పటి వరకు 16 స్థానాల్లో గెలుపొంది.. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్‌డీఎఫ్) ఒక సెగ్మెంట్‌లో లీడింగ్‌లో ఉంది. కొన్ని పార్టీలతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏతో పొత్తు పెట్టుకున్న ఎస్‌కేఎం అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేసింది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాగా, 2019లో ఎస్‌కేఎం 17 సీట్లలో గెలుపొంది అధికారం చేపట్టింది. ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది.

మరోసారి సీఎంగా ఫెమా ఖండూ!

అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ విజయం ఖాయం కావడంతో అందరి చూపు సీఎం సీటుపై పడింది. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి పెమా ఖండూ ఆ పదవిలో మరోసారి కొనసాగుతారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘ బీజేపీ గెలుపు ఖాయమే. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ పాలనపై ఓటర్లు ఉంచిన విశ్వాసానికి ఈ తీర్పు స్పష్టంగా అద్దం పడుతోంది. ఫెమా ఖండూ మరోసారి సీఎంగా కొనసాగుతారు’ అని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి టెక్కీ నెచా తెలిపారు. జూన్ 6వ తేదీ తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed