Manipur Violence: మణిపూర్ మహిళల అఘాయిత్యాల కేసులన్నీ సీబీఐకి.. హింసాకాండపై విచారణకు 6 సిట్‌లు

by Vinod kumar |
Manipur Violence: మణిపూర్ మహిళల అఘాయిత్యాల కేసులన్నీ సీబీఐకి.. హింసాకాండపై విచారణకు 6 సిట్‌లు
X

న్యూఢిల్లీ : మణిపూర్‌లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలతో ముడిపడిన మొత్తం 12 కేసులనూ సీబీఐకి బదిలీ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. హింసాకాండ వేళ జరిగిన అన్ని నేరాలపై దర్యాప్తునకు 6 సిట్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఒక్కో సిట్‌లో ఇద్దరు ఎస్పీ స్థాయి మహిళా అధికారులు ఉంటారని పేర్కొంది. కేవలం మహిళా పోలీసు ఉన్నతాధికారులతో ఏర్పాటయ్యే స్పెషల్ సిట్‌లు మహిళలపై జరిగిన ఇతరత్రా నేరాలపై విచారణ జరుపుతాయని కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలిపారు.

కుకీ, మైతై తెగల మధ్య జరిగిన ఘర్షణలపై విచారణ జరిపేందుకు ఆయా జిల్లాల ఎస్పీల నేతృత్వంలోని ప్రత్ర్యేక సిట్‌లు ఉంటాయని కోర్టుకు చెప్పింది. తెగల మధ్య జరిగిన ఘర్షణల కేసులను ఎస్పీ, ఆపై స్థాయి అధికారులే విచారణ చేస్తారని తెలిపారు. ఈ విచారణలను డీఐజీ, డీజీపీ స్థాయి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారన్నారు. సిట్‌లు జరిపే దర్యాప్తులపై వారానికోసారి డీఐజీ, 15 రోజులకోసారి డీజీపీ సమీక్షిస్తారని తెలిపారు. 160 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న మణిపూర్ హింసకు సంబంధించిన పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed