Tripura Assembly: అసెంబ్లీలో గందరగోళం.. టేబుళ్లపైకి ఎక్కిన ఎమ్మెల్యేలు

by Vinod kumar |
Tripura Assembly: అసెంబ్లీలో గందరగోళం.. టేబుళ్లపైకి ఎక్కిన ఎమ్మెల్యేలు
X

న్యూఢిల్లీ: త్రిపుర అసెంబ్లీలో శుక్రవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల తొలిరోజే గంగదరగోళం జరిగింది. అయితే.. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ దేవ్‌నాథ్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విపక్ష కాంగ్రెస్, సీపీఎం, టిప్రమోతా పార్టీ (టీఎంపీ) సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో విపక్షాలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ ఒక రోజు సస్పెండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ దేవ్‌నాథ్ ఈ ఏడాది ప్రారంభంలో సభలోనే అశ్లీల వీడియోలు చూస్తూ కెమెరాకు చిక్కారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ విషయంపై చర్చించేందుకు ప్రతిపక్ష నేత అనిమేష్ దెబ్బర్మ ప్రవేశ పెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర బడ్జెట్ సమర్పించేందుకు ఆర్థిక మంత్రి ప్రణజిత్ సింఘా రాయ్ ప్రయత్నించగా విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు.

ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకొచ్చి మానవ హారంగా నిలబడటం, మరికొందరు ఎమ్మెల్యేలు టేబుళ్లపైకి ఎక్కి నడవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సుదీప్ రాయ్ బర్మన్ (కాంగ్రెస్), నయన్ సర్కార్ (సీపీఎం), బృషకేతు దెబ్బర్మ, నందితా రియాంగ్, రంజిత్ దెబ్బర్మ (టీఎంపీ) లను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ బిస్వబంధు సేన్ ప్రకటించారు. స్పీకర్ నిర్ణయాన్ని నిరసించిన విపక్ష సభ్యులంతా దేవ్‌నాథ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే.. తనకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఒక సైట్ ఓపెన్ అయిందని, దాన్ని వెంటనే మూసేసినట్లు బీజేపీ త్రిపుర రాష్ట్ర విభాగం కార్యదర్శి కూడా అయిన 55 ఏళ్ల దేవ్‌నాథ్ వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed