ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ

by Harish |
ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అనారోగ్యంతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. 96 ఏళ్ల వయస్సు కలిగిన ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బుధవారం రాత్రి 10.30 గంటలకు ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్న దాని ప్రకారం, అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, పూర్తిగా మా పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు. అద్వానీకి యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే అద్వానీ ఆసుపత్రిలో చేరారని తెలుసుకున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆయన తిరిగి ఇంటికి క్షేమంగా రావాలని ప్రార్థిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం తెలుసుకుంటుంది.

అద్వానీని ఇటీవలే మార్చి 30, 2024న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్నతో సత్కరించారు. ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ప్రధాని మోడీ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సత్కారాన్ని ఆయన నివాసంలో చేశారు. 1927 నవంబర్ 8న కరాచీలో జన్మించిన అద్వానీ 1942లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో చేరారు. 1986 నుంచి 1990 వరకు, తర్వాత 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి అద్వానీ అత్యధిక కాలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అద్వానీ మొదట హోం మంత్రిగా, అటల్ బిహారీ వాజ్‌పేయి (1999-2004) క్యాబినెట్‌లో ఉప ప్రధానమంత్రిగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed