సరబ్ జిత్ సింగ్ హంతకుడి దారుణ హత్య.. ఎలా జరిగిందంటే?

by Shamantha N |
సరబ్ జిత్ సింగ్ హంతకుడి దారుణ హత్య.. ఎలా జరిగిందంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌కు చెందిన సరబ్‌జిత్ సింగ్‌ను జైలులో చంపిన పాక్ అండర్ వరల్డ్ డాన్‌ అమీర్ సర్ఫరాజ్ దారుణ హత్య జరిగింది. ఆదివారం లాహోర్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అమీర్‌ సర్ఫరాజ్‌ను కాల్చి చంపినట్లు సమాచారం.

పాకిస్థాన్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్‌లలో ఒకరైన అమీర్ సర్ఫరాజ్ అలియాస్ తంబాపై లాహోర్‌లోని ఇస్లాంపురలో కాల్పులు జరిగాయి. బైక్ పైన వచ్చిన దుండగులు అమీర్ సర్ఫరాజ్ పై కాల్పులు జరిపారు. సర్ఫరాజ్ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అమీర్ సర్ఫరాజ్ 1979లో లాహోర్‌లో జన్మించాడు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడికి సన్నిహితుడు. జైళ్లో సరబ్‌జిత్ సింగ్‌పై దాడి చేసినందుకు అమీర్ సర్ఫరాజ్ సహా పలువురిపై కేసు నమోదైంది. అయితే, సర్ఫరాజ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం లేకపోవడంతో 2018లో పాకిస్థాన్ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.

సరబ్‌జిత్‌ సింగ్‌ ఎవరు?

సరబ్‌జీత్‌ సింగ్‌ భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దులోని భిఖివిండ్‌ గ్రామానికి చెందిన రైతు. 1991లో పొరపాటుగా సరిహద్దును దాటి పాక్‌లోకి ప్రవేశించారు. 1990లో పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో 14 మంది పాకిస్థానీయులు చనిపోయారు. ఆ కేసులో గూఢచర్యం ఆరోపణలతో సరబ్ జిత్ ను అరెస్ట్‌ చేసిన పాకిస్థాన్‌.. ఆయనకు మరణశిక్ష విధించింది.

లాహోర్‌లోని కోట్‌ లఖ్‌పత్‌ జైలులో శిక్ష అనుభవిస్తుండగా.. అమీర్ సర్ఫరాజ్ సహా ఇతరఖైదీలు సరబ్ జిత్ పై దాడి చేశారు. 49 మంది ఖైదీలు ఒక్కసారిగా ఇటుకలతో అతనిపై దాడి చేశారు. మెదడుకు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన సరబ్ జిత్ అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. దాదాపు 23 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాడు సరబ్ జిత్. 2013లో భారత్‌లో పార్లమెంట్ దాడికి పాల్పడిన అప్జల్ గురుని ఉరితీసిన కొన్ని రోజుల తర్వాతే సరబ్ జిత్ పై దాడి జరగడం గమనార్హం.

దల్బీర్‌ కౌర్‌ న్యాయ పోరాటం

సరబ్ జిత్ సింగ్‌ నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆతని సోదరి దల్బీర్‌కౌర్‌ సుదీర్ఘ కాలం పోరాటం చేశారు. తన సోదరుడు పొరపాటున సరిహద్దు దాటారని.. ఆయనను విడుదల చేయాలంటూ దల్బీర్‌ 22 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. సరబ్‌జిత్‌ను చూసేందుకు పాక్ సైతం వెళ్లివచ్చారు. దల్బీర్‌కౌర్‌ గత ఏడాది ఛాతీ నొప్పితో పంజాబ్‌ అమృత్‌సర్‌కు చెందన ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సరబ్‌జిత్‌ సింగ్‌, దల్బీర్‌కౌర్‌ జీవితాల ఆధారంగా బాలీవుడ్‌లో ‘సరబ్‌జిత్‌’ బయోపిక్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ దల్బీర్‌ పాత్రలో నటించారు.

Advertisement

Next Story

Most Viewed